నేడు రైతులతో కేంద్రం చర్చలు
– చట్టాలు ఉపసంహరించాల్సిందే
– రైతు సంఘాల నేతలు
దిల్లీ,డిసెంబరు 29 (జనంసాక్షి):వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న 40 రైతు సంఘాలతో నేడు కేంద్రం చర్చలు జరుపనుంది. మరోవైపు నూతన చట్టాల రద్దు డిమాండ్‌తో దిల్లీ శివారుల్లో అన్నదాతల ఆందోళన నేడు కూడా కొనసాగింది. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా సింఘు, టిక్రి, చిల్లా, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు తమ నిరసన సాగిస్తున్నారు. కేంద్రంతో జరిపే చర్చల్లో మూడు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర అమలుపై చర్చించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చర్చల రోజు కూడా అన్నదాతల ఉద్యమం సాగనుంది. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో రేపు రైతులు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా.. సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరగనుండటం ఇది ఆరోసారి. ఇప్పటివరకు ఐదు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబట్టగా.. సవరణలు తెస్తామని కేంద్రం చెబుతోంది. 29న చర్చలు నిర్వహిద్దామని రైతు సంఘాలు గత వారం చేసిన ప్రతిపాదనపై కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ఈ మేరకు బదులిచ్చారు. మూడు కొత్త చట్టాల రద్దుకు విధివిధానాలు సహా అన్ని అంశాలపై చర్చ జరగాలని రైతు సంఘాలు తమ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో చర్చలకు హాజరు కావాలని ప్రభుత్వం పిలిచింది. చట్టాల సంబంధిత అంశాలన్నింటికీ తార్కిక పరిష్కారాన్ని కనుగొనేందుకు కట్టుబడి ఉన్నట్లు లేఖలో తెలిపింది. మూడు వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధర కింద అమల్లో ఉన్న సేకరణ వ్యవస్థ, విద్యుత్ చట్ట సవరణ బిల్లు, దిల్లీలో వాయు కాలుష్యం వంటి అంశాలపై సమగ్రంగా చర్చిద్దామని పేర్కొంది. చట్టాల రద్దుకు విధివిధానాల గురించి చర్చించాలని రైతు సంఘాలు పట్టుపడుతుండగా ఆ కీలక విషయంపై ఎలాంటి నిర్దిష్ట హావిూని ప్రభుత్వం ఇవ్వలేదు. చర్చలకు వచ్చేందుకు సూత్రప్రాయంగా తాము సిద్ధమేనని, చట్టాల రద్దుపై మాత్రం దానిలో చర్చ జరగాలని కర్షక నేతలు ప్రకటించారు. 30న సింఘు సరిహద్దు, టిక్రీ సరిహద్దు నుంచి కుండ్లీ-మనేసార్-పల్వాల్ జాతీయ రహదారి వరకు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని రైతులు నిర్ణయించగా అదేరోజు ప్రభుత్వం తదుపరి విడత చర్చలు జరపాలనుకోవడం గమనార్హం.కాగా కేంద్రంతో చర్చలకు వెళ్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధి అభిమన్యు కోహిర్ తెలిపారు. ‘మూడు చట్టాల రద్దు, ఎంఎస్‌పీ అమలుకు చట్టబద్ధమైన హావిూని తాజా చర్చల ఎజెండాలో తప్పకుండా చేర్చాలని ఈ నెల 26న ప్రభుత్వానికి పంపిన లేఖలో స్పష్టంగా తెలిపాం. తాజా లేఖలోనూ నిర్దిష్ట ఎజెండాను ప్రభుత్వం చెప్పలేదు. అయినా చర్చల్లో పాల్గొనడానికి మేం ఆమోదం తెలిపాం’ అని ఆయన వివరించారు. కాగా సింఘు సరిహద్దు వద్ద ఉద్యమిస్తున్న రైతుల సంఖ్య సోమవారం మరింత పెరిగింది. మరిన్ని ట్రాక్టర్లు అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా ఓ టౌన్‌షిప్‌ను తలపింపజేస్తోంది. కొన్నిరోజులు నిరసనలు తెలిపి స్వస్థలాలకు వెళ్లిన రైతుల్లో చాలామంది తమ కుటుంబాలతో సహా తిరిగి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు. జనవరి 2న ఇంకొంత మంది రాబోతున్నారని రైతులు చెబుతున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రైతులకు మద్దతుగా ప్రమాణం చేయాలని కర్షక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.కాగా కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు ఐదుసార్లు చర్చలు జరిగాయి. చట్టాల రద్దు తప్ప మరే ఇతర ప్రతిపాదనలకు రైతులు ఒప్పుకోకపోవడం వల్ల చర్చలన్నీ ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. 33వ రోజూ దిల్లీ సరిహద్దుల్లో కర్షకుల ఆందోళన కొనసాగింది. సింఘు, టిక్రీ, ఘాజిపూర్, చిల్లా వద్ద రోడ్లపై బైఠాయించారు. కొందరు రైతులు త్రివర్ణ పతాకం రంగులను శరీరంపై వేయించుకుని ఆందోళన చేశారు. పంజాబ్‌లో ఆందోళన చేస్తున్న రైతులు 1500 టెలికాం టవర్లను ధ్వంసం చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో టవర్లను ఆందోళనకారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.