నేడు లష్కర్‌ బోనాలు

5
– అమ్మవారికి బోనం సమర్పించనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్ట్‌1(జనంసాక్షి):

తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం బోనాల పండగలో ప్రధానమైన లష్కర్‌ బోనాలు ఆదివారం జరుగనున్నాయి. ఇందుకోసం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.  ప్రజలు, భక్తి ప్రపత్తులతో మహాశక్తిని విభిన్న రూపాలలో కొలుచుకోవటం అనాదిగా వస్తోంది.  తెలంగాణ తెలుగువారి పండుగగా దీనిని అభివర్ణిస్తారు. ప్రత్యేకించి హైదరాబాద్‌ నగరంలో అయితే, ప్రతీ కూడలిలో కొలువుదీరిన అమ్మవారి దేవాలయాలు ఆకుపచ్చని తోరణాలతో, విద్యుద్దీప కాంతులతో అలంకరించారు. ఆలయానికి వచ్చే దారులన్నీ సుందరంగా తీర్చిదిద్దారు. జంటనగరాలకు చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావులు ఏర్పాట్లు చేశారు. బోనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే పదికోట్లను విడుదల చేసింది. ఉదయం ఆలయాన్‌ఇన సిఎం కెసిఆర్‌ సందర్శించనున్నారు. దీంతో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవారికి తమ మొక్కుల్ని తీర్చుకోవడమే కాదు, తమకు అన్నాన్నిస్తున్న ఆ తల్లికి కృతజ్ఞతా సూచకంగా, పవిత్రమైన బోనం కుండలో భోజనాన్ని వండి సమర్పించుకోవడం బోనాల ప్రత్యేకత. చిన్న పిల్లలకు మశూచి, అమ్మవారు వంటి భయానక వ్యాధులు రాకుండా ఉండాలని, అందుకు అమ్మవారు వారికి రక్షణ కవచంగా ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసంతో ఏటా బోనాల పండగ జరుపుకుంటారు. తెలంగాణా సంస్కృతికి అద్దం పడుతూ, హైదరాబాద్‌- సికింద్రాబాద్‌ జంట నగరాలలో అసంఖ్యాకంగా హిందువులు జరుపుకొనే పెద్ద పండుగలలో ఒకటి బోనాలు. దీనిని ఆషాడ జాతర అనీ అంటారు. తెలంగాణలోని అంతటా వివిధ తేదీలలో జరుపుకుంటారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని షాలిబండలో వెలసిన ప్రాచీన అక్కన్న మాదన్న మహాకాళీ ఆలయం, పాతబస్తీలోని లాల్‌ దర్వాజా మహాకాళి అమ్మవారు, సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి దేవాలయాలలో అయితే అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆదివారం ఉజ్జయిని అమ్మవారికి బోనాలు జరుపుతారు.

సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి గుడిని సందర్శించనున్నారు. దీంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడమే గాకుండా ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ చర్యలు తీసుకున్నారు.  బోనాల పండుగ రోజున భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ ఇండ్లలో తయారు చేసుకొని, వాటిని బండ్లలో పెట్టుకొని బయల్దేరుతారు. ఆలయం చుట్టు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి కొంత సమర్పించి, మిగిలింది తమ ఇంటికి తెచ్చుకొంటారు. కుటుంబ సభ్యులంతా దానిని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా వేల సంఖ్యలో భక్తులు బండ్లపై ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ. వీటినే ఫలహారపు బండ్లుగా పిలుస్తారు. బోనాలలో పోతురాజులు వీరంగం చేస్తూ అమ్మ ఆలయానికి తరలి వెళతారు. పోతురాజులతో కలసి, నృత్యాలు చేస్తూ, చిందులు వేస్తూ తెలంగాణ యాసలో పాటలు పాడుతూ, తన్మయత్వంతో కదలి వెళతారు. బోనాల మరసటి రోజు రంగం అంటే భవిష్యవాణి వినిపించడం ఆనవాయితీగా వస్తోంది.  బోనాల పండుగ ప్రతి ఏడూ నిర్ణీత ఆదివారం నాడే జరుగుతుంది. మరుసటి రోజు సోమవారం ఉదయం ముఖమండపంలో మాతంగేశ్వరి ఆలయం వద్ధ అమ్మవారికి ఎదురుగా ఒక అవివాహిత స్త్రీ వచ్చి కుండపై నిలబడుతుంది. దేవతా అమ్మవారి వంకే

తదేకంగా చూస్తూ ఆమె కళనంతా ఆవహింపజేసుకొంటుంది. భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విశేషాలను ఆమె నోటి ద్వారా ఆ దేవతే వెల్లడిస్తుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ భవిష్యవాణిని వినడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. బోనాలకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని చెప్పారు. అందరూ అమ్మవారి కృపకు పాత్రులు  కావాలన్నారు.