నేడు సడక్ బంద్
– దేశ వ్యాప్తంగా రోడ్‌సెఫ్టీబిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన
న్యూఢిల్లీ,ఏప్రిల్29(జనంసాక్షి): రోడ్ సేఫ్టీ బిల్లుపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే దీనిని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఈమేరకు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ గురువారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. కార్మిక వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును మోదీ సర్కారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి పునరాలోచన చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో తేనున్న రోడ్ సేఫ్టీ బిల్లుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతోన్నాయి. రోడ్ సేఫ్టీ బిల్లు ధనిక, అభివృద్ధి చెందిన దేశాల్లోనైతే పని చేస్తోందని కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. ఎందుకంటే అక్కడ రోడ్లు చాలా బాగుంటాయని మన దేశంలోలా ఉండవని వివరించారు. ముందు ఇక్కడ ఉన్న రోడ్ల వ్యవస్థను బాగు చేయకుండా రోడ్ సేఫ్టీ బిల్లును తేవడం సరికాదన్నారు. రోడ్లు బాగు చేయకుండా బిల్లు తెస్తే కార్మికుల జీవితాలపై వేటు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బిల్లుపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్నాయి. ఈ బిల్లు అమలులోకి వస్తే రవాణా నిబంధనలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్లనున్నాయి. దీంతో డ్రైవింగ్‌లో తప్పులు జరిగితే జరిమానాలు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు సిగ్నల్ జంప్‌కు మామూలుగా వందల నుంచి వేలలో జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఓవర్ స్పీడ్‌కు రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు జరిమానా పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా పెనాల్టీ పాయింట్లు 12కు చేరితే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. దీనిపై కార్మిక సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరిగితే తమ బాధ్యత ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ముందు రోడ్లను బాగుపరచాలని తర్వాతే ఇలాంటి చట్టాలు తేవాలని కోరుతున్నారు. ఇప్పుడున్న డ్రైవింగ్ లైసెన్స్‌లను పూర్తిగా రద్దు చేసి అందరూ మళ్లీ కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకోవాలనే నిబంధన కూడా తెచ్చే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. అయితే ఈ బిల్లును పాస్ చేయించడానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. దేశంలో యేటా రోడ్డు ప్రమాదాల వల్ల సుమారు పది వేల మంది వరకు చనిపోతున్నారని మంత్రి వాదిస్తున్నారు. కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోన్నా ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదింపంజేయాలని చూస్తోన్నట్టు సమాచారం. పలు ట్రాన్స్‌పోర్టు సంస్థలు, ఆటో యూనియన్లు, కార్మిక సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈమేరకు సంస్థలన్నీ దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్టు బంద్‌కు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణలో టీఎంయూతో పాటు పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని డిపోల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించాయి. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉంటుందని ఏదైనా చిన్న తప్పు జరిగినా ఆర్టీసీ డ్రైవర్‌నే అంటున్నారని తెలిపారు.