నేడు సిద్ధిపేటకు సీఎం కేసీఆర్
సిద్దిపేట,డిసెంబరు 9 (జనంసాక్షి):సిద్దిపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రాంతానికి ‘కేసీఆర్ నగర్’ అని నామకరణం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రేపు సిద్దిపేటలో పర్యటించనున్న సీఎం కేసీఆర్ అక్కడ నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.163 కోట్ల వ్యయంతో 2,460 ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందని వెల్లడించారు. తొలి విడతలో 1,341 ఇళ్లు, రెండో విడతలో 1000 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వివరించారు. సిద్దిపేటలో 3 ఎకరాల్లో రూ.45 కోట్ల వ్యయంతో ఐటీ హబ్ నిర్మాణాన్ని త్వరలోనే చేపట్టనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.
(ప్రధానికి కేసీఆర్ లేఖ)
హైదరాబాద్,డిసెంబరు 9 (జనంసాక్షి):దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రికి లేఖ రాశారు. గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సిఎం కొనియాడారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, అవి వలస పాలనకు గుర్తుగా ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. ”సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కావాలి” అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.