నేడు సీతారామకు ప్రారంభోత్సవం
సిఎం చేతుల విూదుగా పైలాన్ ఆవిష్కరణ
వైరాలో భారీ రైతు సభ..చివరిదశ రుణమాఫీకి నిధుల విడుదల
భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్14 (జనం సాక్షి) : జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల సాగు నీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్ట్‌ను ఆగస్టు 15న ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు. పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేసి డెలివరి సిస్టర్న్ వద్ద గోదారమ్మకు సీఎం రేవంత్ పూజలు చేయనున్నారు. స్వాతంత్యద్రినోత్సవం రోజు గోల్కొండ కోటలో సీఎం రేవంత్ జెండా ఎగరేశాక హెలికాప్టర్ ద్వారా నేరుగా ఖమ్మం జిల్లా వైరాకు చేరుకోనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌లను ప్రారంభించిన అనంతరం అక్కడే భోజనాలు చేసుకుని వైరాలో జరుగనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. అక్కడే తుదివిడత రుణమాఫీని కూడా ప్రారరంభించే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ పర్యటన ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్ తన రాజకీయ జీవిత సంకల్పమన్నారు. వైరా రైతు రుణమాఫీ సభ చరిత్రలో నిలుస్తుందని పేర్కొన్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలనే సీతారామ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశామన్నారు. గత ప్రభుత్వం 8 వేల కోట్లతో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ మోటార్లు పాడవకుండా సద్వినియోగం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆగస్ట్ 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం చేయాలన్నారు. రైతాంగం తలరాత మార్చే సభగా వైరా సభ నిలవనుందని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ‘నా జీవిత కోరిక సీతారామతో తీరింది‘ అని అన్నారు. ªూగా… రెండు రోజుల క్రితం సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈనెల 11న పుసుగూడెం, కమలాపురం పంపుహౌస్?ల వద్ద మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్-2 ట్రయల్ రన్‌ను మంత్రులు ప్రారంభించారు. అలాగే ఆగష్టు 15న రాష్ట్రంలో రైతులు రుణ విముక్తి కానున్నారు. సీతారమ ప్రాజెక్ట్ ప్రారంభం అనంతరం వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణాలను మాఫీ చేయనున్నారు. మూడో విడతగా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ నిధులను వైరాలో సీఎం విడుదల చేనున్నారు. దాదాపు 14.45 లక్షల
మందికి రుణమాఫీ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రుణమాఫీకి అర్హులైన ఖాతాలను మొత్తంగా 32.50 లక్షలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. జులై 18న తొలి విడుతగా 11,4,412 మంది రైతులకు రూ.6034.97 కోట్ల నిధులను విడుదల చేసింది. తొలివిడతలో లక్ష వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ అయ్యాయి. అలాగే జూలై 30 అసెంబ్లీ ప్రాంగణంలో రెండో విడత రుణమాఫీ నిధులను సర్కార్ విడుదల చేసింది. రెండో విడతలో లక్ష నుంచి లక్షన్నర వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ అయ్యాయి. అలాగే మూడో విడతలో లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు రుణాలను సర్కార్ మాఫీ చేయనుంది. ఈక్రమంలో సిఎం రేవంత్ పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేశారు.