నేడు హరితహారం

3

– సీఎం కేసీఆర్‌ సుడిగాలి పర్యటన

హైదరాబాద్‌,జులై2(జనంసాక్షి):

తెలంగాణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే అపూర్వఘట్టం హరితహారానికి శుక్రవారం శ్రీకారం చుట్టబోతున్నారు. మానవ చరిత్రలోనే ఇదో అపూర్వ ఘట్టమని భావిస్తున్నారు. దాదాపు 40కోట్ల మొక్కలను పది జిల్లాల్లో నాటనున్నారు. శుక్రవారం ‘హరితహారం’ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్‌ సన్నాహాలు చేస్తోంది.  హరితహారంతో తెలంగాణలో పచ్చదనానికి  సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారని అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. హరితహారం పథకంపై ఆయన విూడియాతో మాట్లాడుతూ.. చైనా, బ్రెజిల్‌ తర్వాత అత్యంత వేగంగా ఎక్కువ మొత్తంలో అటవీ పెంపంకం చేపడుతున్నది తెలంగాణలోనే. రేపు చిలుకూరి బాలాజీ ఆలయ ప్రాంగణంలో సీఎం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మొదటి దఫా ఈ సంవత్సరం 40 కోట్ల మొక్కలను నాటేందుకు సర్వం సిద్ధం చేశాం. హరితహారంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.  మొదటి దఫా జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు కొనసాగుతది. హరితహారంలో అన్ని రకాల మొక్కలను ప్రజలకు అందిస్తామని ,. రాష్ట్రంలో అటవీశాతాన్ని 33కు పెంచుతామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారంలో పాల్గొనే షెడ్యూల్‌ ఖరారైంది. ఆకుపచ్చ తెలంగాణ కోసం చేపట్టిన హరితహారం పథకాన్ని సీఎం శుక్రవారం  రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సీఎం బాలాజీ వెంకటేశ్వరుడిని దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ హాస్టల్‌లో మొక్కలు నాటుతారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ హరితహారం పేరుతో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. శుక్రవారం నుంచి నాలుగురోజుల పాటు ఆరు జిల్లాల్లో కొనసాగనున్న కేసీఆర్‌ పర్యటన.. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలో దైవ దర్శనం చేసుకుని మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభం కానుంది. ఈనెల 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

చిలుకూరులో హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలుత బాలాజీ దేవాలయంలో దేవుడిని దర్శించుకుని అనంతరం మొక్కలు నాటనున్నారు. అక్కడినుంచి కేసీఆర్‌ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మేడిపల్లి, నారపల్లిలో కేసీఆర్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.4న హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలో, 5న కరీంనగర్‌, ఆదిలాబాద్‌లో,6న నిజామాబాద్‌ జిల్లాలో జరిగే హరితహారం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ నెల 5న రాష్ట్రపతి యాదాద్రి పర్యటన దృష్ట్యా సీఎం హరితహారం షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. 5న ఉదయం సీఎం హెలికాప్టర్‌ ద్వారా కరీంనగర్‌ నుంచి యాదాద్రికి బయల్దేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన అనంతరం తిరిగి కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి సీఎం కేసీఆర్‌ చేరుకోనున్నారు. ఇక 4వ తేదీన మెదక్‌ జిల్లాలో కేసీఆర్‌ హరిత హారం కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. తూంకుంట, షావిూర్‌పేట, తుర్కపల్లి, సిద్దిపేట, మిట్టపల్లి, పాలమాకుల, బద్దిపడగ, బస్వాపూర్‌లలో కేసీఆర్‌ మొక్కలు నాటుతారు. అనంతరం కరీంనగర్‌ జిల్లాకు చేరుకుంటారు. హుస్నాబాద్‌, చిగురుమామిడి, కొత్తపల్లి, తిమ్మాపూర్‌లలో నిర్వహించే హరితహారంలో సీఎం పాల్గొంటారు. అదేరోజు రాత్రి ఎల్‌ఎండీ డ్యామ్‌ వద్ద కేసీఆర్‌ బస చేస్తారు. ఇక 5వ తేదీన కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి, ధర్మారం విూదుగా ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేటకు సీఎం చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి నేరుగా జన్నారం, కడెం, ఖానాపూర్‌, నిర్మల్‌లలో జరిగే కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొంటారు. అదేరోజు రాత్రి నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో బస చేస్తారు. 6వ తేదీన నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌, మోతే, ఆర్మూర్‌, నిజమాబాద్‌ అర్బన్‌, సదాశివనగర్‌రి, కామారెడ్డిలో పర్యటిస్తారు. ఆ తర్వాత మెదక్‌ జిల్లా రామాయంపేటలో జరిగే హరితహారం కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్‌ మొక్కలు నాటుతారు.