నేడే ఎమ్మెల్సీ పోలింగ్‌

ఏర్పాట్లు పూర్తి , 6.3 లక్షల మంది ఓటర్లు
రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి):
గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ చెప్పారు. 14జిల్లాల పరిధిలోని ఆరు నియోజకవర్గాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. గురువారం ఉదయం 8గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. బుధవారంనాడు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై మీడియాకు వివరాలు వెల్లడించారు. మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 84మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నారు. పట్టభద్రుల నియోజవర్గాలలో 65, పట్టభద్రుల నియోజకవర్గాలలో 19మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గాలలో మొత్తం 55,158మంది, పట్టభద్రుల నియోజకవర్గాలలో 5,76,964మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన తెలిపారు. ఈ ఎన్నికలకు 1437పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 6లక్షల 32వేల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఎన్నికలు జరుగుతున్న జిల్లాలకు ఆరుగరు సీనియర్‌ ఐఎయస్‌ అధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద మైక్రో అబ్జర్వర్‌తో పాటు వెబ్‌క్యామ్‌లు కూడా ఏర్పాటు చేశామని భన్వర్‌లాల్‌ తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగానికి పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచి వైలట్‌(ఊదా)రంగు స్కెచ్‌పెన్‌ను మాత్రమే ఉపయోగించాలని ఆయన తెలిపారు. ఏ భాషలోనైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని చెప్పారు. గుర్తింపు కార్డుతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. ముందుజాగ్రత్త చర్యగా పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పారు. 25వ తేదీన ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. వచ్చేనెల 29వ తేదీన మరో 10 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీలు ఏర్పడతాయని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తాము ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు.