నేతాజీ దస్త్రాలను బహిర్గతం చేసిన ప్రధాని మోదీ


1
న్యూదిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించిన దస్త్రాలను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ బహిర్గతం చేశారు. సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబసభ్యుల సమక్షంలో భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం(ఎన్‌ఏఐ)లో పత్రాలు విడుదల చేశారు. నేతాజీ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన దస్త్రాలను చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

నేతాజీ జీవితానికి సంబంధించిన 100 రహస్య దస్త్రాలను డిజిటల్‌ ప్రతుల రూపంలో బహిర్గతం చేశారు. ఈ కార్యక్రమానికి 12 మంది నేతాజీ కుటుంబసభ్యులు హాజరయ్యారు. 70ఏళ్ల క్రితం బోస్‌ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆయన గురించి మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. నేతాజీ మరణంపై గతంలో వేసిన రెండు దర్యాప్తు కమిషన్‌లు ఆయన తైపీలో 1945, ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలిపాయి. కానీ ఆయన కుటుంబసభ్యులు, మరికొందరు ఈ విషయాన్ని అంగీకరించలేదు. ఆయన గురించి పూర్తి సమాచారం కోసం దస్త్రాలను బహిర్గతం చేయాలని అడిగారు.