నేను ఒంటరిని కాదు.. మేరే సాత్‌ బహెన్‌ హే.. ` ప్రియాంక


లఖ్‌నవూ,డిసెంబరు 22(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభ కోల్పోయిందంటూ వస్తోన్న విమర్శలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దీటుగా స్పందించారు. ప్రముఖ బాలీవుడ్‌ సినిమా ‘దీవార్‌’లోని ఫేమస్‌ డైలాగ్‌ను గుర్తుచేసుకుంటూ ‘మేరే పాస్‌ బహెన్‌ హై(నా దగ్గర సోదరీమణులు ఉన్నారు)’ అంటూ గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..ప్రియాంక గాంధీని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఓ జర్నలిస్టు.. ‘‘కాంగ్రెస్‌ పార్టీ తమ ప్రతి ర్యాలీలో మహిళల గురించే మాట్లాడుతోంది.. రాష్ట్రంలో ఆ పార్టీ తమ ప్రాబల్యాన్ని నానాటికీ కోల్పోతోంది అని ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై విూ స్పందన ఏంటీ’’ అని ఆమెను ప్రశ్నించారు. దీనికి ప్రియాంక స్పందిస్తూ.. ‘‘అమితాబ్‌ బచ్చన్‌, శశికపూర్‌ నటించిన దీవార్‌ సినిమాలో ఓ డైలాగ్‌ విూరు విన్నారా..? అందులో అమితాబ్‌.. నా వద్ద కారు ఉంది.. బంగ్లా ఉంది.. అది ఉంది.. ఇది ఉంది అని చెప్తారు. అప్పుడు వెంటనే శశికపూర్‌.. నా దగ్గర అమ్మ ఉంది(మేరే పాస్‌ మా హై) అని అంటారు. అలాగే నా వద్ద సోదరీమణులు ఉన్నారు(మేరే పాస్‌ బహెన్‌ హై). రాజకీయాల్లో వీళ్లు మార్పు తీసుకొస్తారు. మేం అమ్మాయిలం.. పోరాడే సత్తా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో 40శాతం టికెట్లు మహిళలు కేటాయిస్తామని ప్రకటించిన హస్తం పార్టీ.. మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ‘శక్తి విధాన్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ మేనిఫెస్టో ద్వారా పలు హావిూలు ప్రకటించారు. విద్యార్థినులకు స్కూటీలు, స్మార్ట్‌ఫోన్‌లు ఉచితంగా అందిస్తామని హావిూ ఇచ్చింది.