‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్‌కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి
వాష్టింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు అయోవాలోని ఒక టౌన్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన అనంతరం మీ సలహాదారుడి (adviser)గా ఎవరిని నియమిస్తారు అని అడిగిన ప్రశ్నకు వివేక్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తన పరిపాలనలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను సలహాదారుడిగా నియమిస్తానని అన్నారు. అందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. ”అమెరికాకు నేను ఏమి చేయాలనుకుంటున్నాను అనే దానికి ట్విటర్ మంచి ఉదాహరణ. గతేడాది ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. అందువల్ల నేను గెలిస్తే.. ఆయననే ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తా. ట్విటర్ మాదిరిగానే ప్రభుత్వాన్ని కూడా ఆయన సమర్థవంతంగా నడిపించగలరు” అంటూ వ్యాఖ్యానించారు.
అమెరికా ఎన్నికల్లో వివేకానందం!
ఇటీవల మస్క్ చైనా పర్యటనను వివేక్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే, అందుకు భిన్నంగా వివేక్ నమ్మకమైన అభ్యర్థి అంటూ మస్క్ కొనియాడారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో రామస్వామి పేరు మారుమోగుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రోజురోజుకూ ఆయన ప్రాచుర్యం పెరుగుతోంది.