నేను పార్టీ మారడం లేదు

1
– కాంగ్రెస్‌లోనే కొనసాగుతా:దానం

హైదరాబాద్‌,జులై5(జనంసాక్షి):తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వదంతులపై కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్‌ హస్తాన్ని వీడట్లేదు.. కారెక్కట్లేదు అని.. అవన్నీ వదంతులని దానం ఖండించారు. ఇప్పటికే వదంతులపై స్పందించిన ఆయన కాంగ్రెస్‌ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడే ప్రసక్తే లేదని ప్రకటించారు. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా నగరంలో మంచి పట్టున్న దానం నాగేందర్‌ను టీఆర్‌ఎస్‌ లాగేసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతుందన్న నేపథ్యంలో… అవన్నీ వదంతులేనని.. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ మంచిది కాదని చెప్పిన దానం.. అయితే తనకు పొగ పెట్టి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తనను కాంగ్రెస్‌ను బయటికి నెట్టేసే ప్రయత్నం జరుగుతుందేమోనని చెప్పారు.  తాజాగా ఆదివారం ఉదయం విూడియాతో మాట్లాడుతూ.. దానం ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. పార్టీ మారట్లేదని విస్పష్టంగా ప్రకటించినా, ఇవేం ప్రశ్నలంటూ ఆయన విూడియా ప్రతినిధులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. పనిలో పనిగా టీఆర్‌ఎస్‌ పాలనపై ఫైర్‌ అయ్యారు. ఒంటెత్తు పోకడలకు వెళ్తే కిరణ్‌ రెడ్డికి ఏ గతి పట్టిందో చూశామన్నారు. త్వరలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తామని దానం తెలిపారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో అరచేతిలో స్వర్గం చూపించిందన్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ప్రతిపక్షాలను బలహీనపరుస్తోందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సీమాంధ్రులు ఆలోచించుకొని తమ ఓటుతో సరై నిర్ణయం ఇవ్వాలన్నారు. గ్రేటర్‌ ఎన్నికల పైన తాము టీఆర్‌ఎస్‌ను సవాల్‌ చేస్తున్నామని చెప్పారు.  ఎంతసేపు ఏ రాజకీయ నాయకుడిని లాక్కుందామనే ఆలోచన తప్ప కేసీఆర్‌కు మరో ఆలోచన లేదన్నారు. ఓయూ వల్లనే ఉద్యమానికి ఊపిరి వచ్చిందని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు విద్యుర్థుల గొంతు పట్టుకున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించాలన్నారు. కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో కోతుల కథ చెప్పారని, కానీ తెలంగాణలోను కోతులు వచ్చాయని తెరాస అధికారాన్ని ఉద్దేశించి అన్నారు. విూరు కోతులు కాదనే ప్రజలు అధికారం కట్టబెట్టారని, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.