నేను రాష్ట్రపతి రేసులో లేను!

రాష్ట్రపతి పదవికి తాను రేసులో లేనని బీజేపీ సీనియర్ నేతల, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ స్పష్టం చేశారు. పార్లమెంటు ఆవరణలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రపతి పోటీకి సంబంధించి తనకు ఎలాంటి వివరాలు తెలియవన్నారు. తానా రేసులో లేనప్పుడు ఆ రేసు గురించి తెలుసుకోదలచుకోలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నపుడు రాష్ట్రపతిగా అద్వానీని నియమించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. సోమనాథుడి సాక్షిగా అద్వానీకి ఈ విషయమై మాట కూడా ఇచ్చారని, గురు దక్షిణగా ఆ రాష్ట్రపతి పదవిలో కూర్చోబెడతానని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ సీనియర్‌ నేతల సాక్షిగా చెప్పారని సమాచారం. ఇదే విషయాన్ని విలేకరులు అద్వానీ వద్ద ప్రస్తావించినప్పుడు తను రాష్ట్రపతి రేసులో లేనని మాత్రమే ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. జూన్‌, జులై నెలల్లో ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికలను జరగనున్న నేపథ్యంలో ఈ నెల 10న ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్‌డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుంది. ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి అభ్యర్థులపై మిత్రపక్షాల నేతలతో ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి తరుణంలో అద్వానీ తను రాష్ట్రపతి రేసులో లేనని చెప్పడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎన్‌డీఏ సమావేశం దగ్గర పడుతున్న సమయంలో ఆయనీ ప్రకటన ఉద్దేశ పూర్వకంగానే చేశారని, తన ప్రకటనపై ఏ మేరకు స్పందన వస్తుందో తెలుసుకోవాలనే ఆయన అలా చెప్పి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రపతి పదవికి అద్వానీతో పాటు సుష్మా స్వరాజ్‌, మోహన్‌ భాగవత్ పేర్లు వినిపించాయి.