నేనే ముగ్గుర్ని కాల్చి చంపాను..
మనీలా : తాను మేయర్‌గా ఉన్నప్పుడు ముగ్గుర్ని కాల్చి చంపినట్లు పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు డుటెర్టి అంగీకరించారు. ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దావో నగరానికి డుటెర్టి సుమారు రెండు దశాబ్ధాల పాటు మేయర్‌గా ఉన్నారు. అయితే ఆ సమయంలో నేరాలకు పాల్పడ్డ ముగ్గుర్ని పిస్తోల్‌తో కాల్చి చంపారు. వాళ్లకు ఎన్ని బుల్లెట్లు దిగాయో తెలియదు, కానీ అది నిజం, నేను అబ్దాలు చెప్పడం లేదంటూ పిలిప్సీన్స్ దేశాధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రెసిడెంట్ ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో డుటెర్టి డ్రగ్ నేరస్తుల గురించి మాట్లాడారు. ఆ సమావేశంలో వ్యాపారవేత్తలతో మాట్లాడుతూ దావోలో తాను సాగించిన వేట గురించి వివరించారు. డ్రగ్ నేరస్తులను ఏ రకంగా అణిచివేయాలని డుటెర్టి ఆ సమావేశంలో సూచించారు. మేయర్‌గా ఉన్నప్పుడు తాను కూడా ముగ్గుర్ని చంపినట్లు చెప్పారు. అయితే ఈ అంశాన్ని తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డుటెర్టి ఒప్పుకున్నారు. కొన్ని నెలల క్రితం దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన డుటెర్టి డ్రగ్ నేరస్తులపై ఉక్కుపాదం మోపారు. దాదాపు 6 వేలకుపైగా డ్రగ్ నేరస్తులను హతమార్చారు. అయితే ఆ కాల్చివేతల వెనుక డుటెర్టి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పదవీ కాలం ముగిసే వరకు డ్రగ్ డీలర్ల భరతం పడుతానని డుటెర్టి ప్రతిజ్ఞ కూడా చేశారు.