నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణం
కాట్మాండ్ అక్టోబర్12(జనంసాక్షి):
నేపాల్ నూతన ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ప్రమాణం చేశారు.నిరాడబరంగా సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో నేపాల్ రాష్ట్రపతి బరన్‌యాదవ్ ఆయనచే ప్రమాణం చేయించారు.అంతకు ముందు ఆదివారం పార్లమోంట్ భవనంలో జరిగిన ఓటింగ్ లో నేపాల్ ప్రధానిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (సిపిఎన్-యుఎమ్‌ఎల్) ఛైర్మన్ కె.పి.శర్మ ఓలి ఎన్నికయ్యారు. 598 ఓట్లకుగాను శర్మ 338 ఓట్లు సాధించి ప్రత్యర్థి సుశీల్ కోయిరాలాపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. నూతన రాజ్యాంగాన్ని స్వీకరించిన తర్వాత నేపాల్ రాజకీయాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామమిది. నూతన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ మాదేషీ సహా కొన్ని మైనార్టీ వర్గాల ప్రజలు ఆందోళన చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆందోళనలు…నిరసనల వల్ల వివిధ ప్రాంతాల్లో హింస ప్రజ్వరిల్లింది. ఈ పరిణామాల్ని ప్రధానిగా సుశీల్ కోయిరాలా నియంత్రించటంలో విఫలమయ్యారు. ఈ తరుణంలో ప్రధాని పదవికి సుశీల్ కోయిరాలా రాజీనామా చేయటం…ఆయన స్థానంలో కె.పి.శర్మ (పూర్తి పేరు ఖడ్గ ప్రసాద్ శర్మ) ఎన్నికవటం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పార్లమెంట్‌లో యునైటెడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు), రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ-నేపాల్, మాదేషీ జనాధికార్ ఫోరమ్-డెమొక్రటిక్, మరికొన్ని పార్టీలు శర్మకు మద్దతుగా నిలిచాయి. 63 సంవత్సరాల కె.పి.శర్మ గత ఏడాదే సిపిఎన్-యుఎమ్‌ఎల్ పార్టీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీనికంటే ముందు పార్టీలో ఆయన అంతర్జాతీయ రాజకీయ విభాగానికి చీఫ్‌గా వున్నారు. దేశాధ్యక్షుడు రామ్‌బరన్‌యాదవ్…నూతన ప్రధాని శర్మతో ప్రమాణ స్వీకారం చేయించటం ఇక లాంఛనమే. కాగా ప్రధానిగా ఎన్నికైన శర్మకు భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్టు పిఎంఓ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
సుశీల్ కోయిరాలా శనివారం ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో నూతన ప్రధానిని ఎన్నుకోవటం అనివార్యమైంది. అయితే, రాజీనామా చేసినప్పటికీ…నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సి) తరఫున కోయిరాలా పోటీలో నిలిచారు. సుశీల్ కోయిరాలా పేరును మాజీ ప్రధాని, నేపాల్ కాంగ్రెస్ సీనియర్ నేత షేర్ బహదూర్ దూబే ప్రతిపాదించారు. అటు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్టు, లెనినిస్టు) నుంచి కె.పి.శర్మ బరిలోకి దిగారు.
ఏడేళ్ల సంప్రదింపుల అనంతరం నేపాల్‌లో గత సెప్టెంబర్ 20న కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాగా మాదేషీ, తరు సహా కొన్ని మైనార్టీ వర్గాలు కొత్త రాజ్యాంగాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వున్నాయి. నూతన రాజ్యాంగం తమకు ప్రత్యేక హక్కులను కల్పించలేదని, తగిన ప్రాతినిథ్యం ఇవ్వలేదని, దేశాన్ని ఏడు రాష్ట్రాలుగా విడగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాయి. గతకొన్నివారాలుగా జరుగుతున్న ఆందోళనల వల్ల హింస చెలరేగింది. ఈ హింసాయుత ఘటనల్లో 40 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.