నేపాల్ శవాల దిబ్బ
– ఎటుచూసిన హృదయవిదారక దృశ్యాలు
– మందకోడిగా సాగుతున్న సహాయక చర్యలు
ఖాట్మండ్,ఏప్రిల్29(జనంసాక్షి): నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుఉతన్నాయి. భూకంప బాధితుల్లో ఎవరినీ కదిలించినా కన్నీటి గాథే. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యమే. ప్రకృతి ప్రకోపానికి గురై ఐదు రోజులైనా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు. శిథిలాల తొలగిస్తున్నా కొద్దీ గుండె తరుక్కుపోయే దృశ్యాలు..సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. క్షణం ఒక యుగంలా గడపడమంటే ఏమిటో ఖాట్మండ్ ప్రజలు స్వయంగా అనుభవిస్తున్నారు. కళ్లముందే కూలిపోయిన మేడలు, వాటిలోనే సజీవ సమాధి అయిపోయిన జనాన్ని ప్రత్యక్షంగా చూసిన భయంకర అనుభవం వాళ్లది. అందుకు గుమ్మంలో నిలబడాలన్నా గజ గజ వణికిపోతున్నారు. కాళ్లకింద ఉన్న భూమి ఎప్పుడు కదిలిపోతుందో… తమనంతా కప్పేస్తుందేమోనన్న భయం సగటు ప్రజల కళ్లల్లో కనిపిస్తోంది. ఏప్పుడు భూ ప్రకంపనలు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని, అందుకే వాళ్లు ఇళ్లల్లో ఉండకుండా రోడ్లపైనే టెంట్లు వేసుకుని
ఉంటున్నారు. నగరంలో శవాల దుర్గంధంతో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరిస్తున్నారు. కొన్ని చోట్ల షాపులు తీసినా… యజమానులు భయంతో బయటే నిలబడుతున్నారు.
కొండ ప్రాంతాలకు చేరుకోలేక పోతున్న సిబ్బంది
భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన మారుమూల కొండ ప్రాంతాలకు ఇప్పటికీ సహాయక సిబ్బంది చేరుకోలేకపోతున్నారు. నాలుగు రోజులవుతున్నా సహాయ సిబ్బంది గానీ, సహాయక సామాగ్రి గానీ అందలేదని బాధితులు వాపోతున్నారు. భూకంపం కారణంగా సర్వం కోల్పోయి తిండి, నీరు లేక ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు. వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటకమేర్పడుతోంది. కాంఠ్‌మాండూ, తదితర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కాఠ్‌మాండూలో నివాసముంటున్న వారు దిక్కుతోచని స్థితిలో సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు
ప్రయత్నిస్తున్నారు.
విదేశీ సహాయ సిబ్బందిని వద్దంటున్న నేపాల్
భూకంప బాధిత నేపాల్ అత్యంత దారుణమైన పరి/-థసితులను ఎదుర్కొంటోంది. సహాయం చేయడానికి వచ్చేవారిని కూడా రావద్దని చెప్పే పరి/-థసితి ఇప్పుడక్కడ నెలకొంది. సహాయక చర్యల కోసం ఇతర దేశాల నుంచి వచ్చిన సిబ్బంది చాలని.. ఇక రావద్దని నేపాల్ తెలిపినట్లు ఐరాస సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన సహాయక సిబ్బంది, సహాయ సామాగ్రితో కాఠ్‌మాండూలోని విమానాశ్రయం కిక్కిరిసిపోయిందని.. కొత్తగా వచ్చే వారి కోసం ఏర్పాట్లు చేసే పరిస్థితిలో లేమని నేపాల్ స్పష్టంచేసింది. ఖాట్మండ్‌లో ఇప్పటికే సహాయక సిబ్బంది, విదేశీ నిపుణులు పలువురు ఉన్నారని, పలు రకాల ఇబ్బందుల కారణంగా చాలా మంది సహాయక సిబ్బంది ఇతర ప్రాంతాలకు వెళ్లలేక ఇంకా కాఠ్‌మాండూలోనే ఉండిపోవాల్సి వచ్చిందని యూఎన్ ప్రతినిధి తెలిపారు. ఇదిలావుంటే ఖాట్మండ్‌లో కుప్పకూలిన ఓ అపార్ట్‌మెంట్ శిథిలాల్లో మూడు మృతదేహాల మధ్య ఓ 28 ఏళ్ల యువకుడు 80 గంటలు గడిపాడు. నీళ్లు లేవు.. ఆహారం లేదు..కనీసం తన ఆర్తానాదాలు బయటి ప్రపంచానికి వినిపించే అవకాశమే లేదు. మహారాజ్‌గంజ్‌లోని బసుందరలో ఓ మహిళ సునీతా సితౌలా శిథిలాల మధ్య చిక్కుకొని 50 గంటలు గడిపింది. ఇండియన్ రెస్క్యూ టీమ్ ఆమెను గుర్తించి బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె తన భర్త..ఇద్దరు కుమారులతో పునరావాస కేంద్రంలో క్షేమంగా ఉంది. తాను కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉందని సునీతా సితౌలా అన్నారు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం
ఇప్పటికే భూకంపంతో అతలాకుతలమైన నేపాల్‌కు మరో ప్రమాదం పొంచి ఉంది. ఓ పక్క వేలాదిగా భవనాలు కుప్పకూలాయి. శిథిలాలను తొలగించే పని ఒక కొలిక్కి రాలేదు. వర్షం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేపాల్‌లో రానున్న వారాల్లో కొండచరియలు, బురదతో ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భూకంపం ధాటికి వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. కొండ ప్రాంతాలు కూడా బాగా కదిలిపోయాయి. దీంతో కొన్ని వారాల్లో వర్షాకాలం ప్రారంభమైతే కొండచరియలు విరిగిపడే ప్రమాదం తీవ్రంగా ఉందని, ఫలితంగా భారీ మొత్తంలో బురద కొట్టుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో, పలు కొండ ప్రాంతాల్లో, కాఠ్‌మాండూ ఉత్తర ప్రాంతం, ఎవరెస్టు శిఖరం పశ్చిమ ప్రాంతాలలో ఈ ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉందని మిషిగాన్ విశ్వవిద్యాలయ
పరిశోధకులు వెల్లడించారు. అత్యంత ప్రమాదకరమైన చాలా ప్రాంతాలను తాము గుర్తించినట్లు చెప్పారు.