నేపాల్ భూకంపం..700 మంది మృతి..
నేపాల్ : భూకంపం సృష్టించిన బీభత్సానికి 700 మంది బలయ్యారు. శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రాజధాని నగరం ఖాట్మండు కు 77 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్ పై 7.9గా నమోదైన ఈ భూకంప తీవ్రతకు ఎత్తైన భవనాలు, చారిత్రక కట్టడాలు నేలకూలాయి. దీనితో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. శిథిలాల కింద ఎంతో మంది చిక్కుకపోయారు. ఎక్కడ చూసినా మృత దేహాలు..శిథిలమైన భవనాలు దర్శనమిస్తున్నాయి. 125 మంది భారతీయులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఖాట్మండులో భారీగా ఆస్తి..ప్రాణ నష్టం..
ఖాట్మండు వీధులన్నీ ఆర్తనాదాలు..హాహాకారాలతో దద్దరిల్లుతున్నాయి. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. దీనితో పలువురికి క్షతగాత్రులకు బయటే చికిత్స అందిస్తున్నారు. అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్, రవాణ, సమాచార సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. నేపాల్ రాజకోట ఆనుకుని ఉన్న గోడలు సైతం కూలిపోయాయి. 1832లో నెలకొల్పిన ధరహర టవర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ టవర్ కింద ఎంతో మంది చిక్కుకున్నట్లు సమాచారం.
భారత్ లోను పెరుగుతున్న మృతుల సంఖ్య..
నేపాల్ లో సృష్టించిన భూకంప ప్రభావం భారతదేశంపై కూడా పడింది. నేపాల్ సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో ఈ ప్రభావం కనిపించింది. బీహార్ లో 23 మంది, యూపీలో 8 మంది, వెస్ట్ బెంగాల్ లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్ అధికారికంగా ప్రకటించారు. నేపాల్ లో సృష్టించిన భూకంపం బీభత్సంపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో బృందంలో 45 మంది ఉంటారని, వీరంతా ఖాట్మండులో సహాయక చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే నేపాల్ లో ఉన్న భారతీయుల సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.