నేరం మాది కాదు.. దొంగలది..’
గోదావరిఖని, ఆగష్టు 2, (జనంసాక్షి):పారిశ్రామిక ప్రాంత బులియన్ మార్కెట్‌కు ‘పోలీసు’ భయం పట్టుకుంది. స్థానిక లక్ష్మినగర్‌లోని నగల దుకాణాలకు గత ఐదు రోజులుగా తాళాలు వేసి ఉంటున్నాయి. ఎప్పుడు… ఎక్కడి నుంచి… ఏ పోలీసులు ‘రికవరీ’ కోసం వస్తారోనని… వ్యాపారులు జంకుతున్నారు. పోలీసుల వెంటోచ్చే దొంగ ఇచ్చే సమాచారం తమ కొంప ముంచే ప్రమాదముందని… కొందరు వ్యాపారులైతే అజ్ఞాతంలోకి వెళ్ళారు. నెలలో రెండు మూడు సార్లు ఇతర ప్రాంతాల నుంచి పోలీసులు వచ్చి దొంగలు చూపించే వ్యాపారులను అదుపులోకి తీసుకోవడం ఈ ప్రాంతంలో పరిపాటిగా మారింది. అదుపులోకి తీసుకున్న వ్యాపారులను దొంగ సొత్తును కొన్నావంటూ… సదరు వ్యాపారి నుంచి బంగారం రూపంలో కానీ… నగ రూపంలో కానీ… పోలీసులు తీసుకోవడం, తరువాత ఆ వ్యాపారిని వదిలిపెట్టడం జరుగుతోంది. ఈ దొంగబంగారం ఇక్కడి వ్యాపారులు దొంగ నుంచి కొనడంలో ఎంతవరకు నిజముందో కానీ… ఒకరిద్దరి వ్యాపారులు చేసే తప్పిదం స్థానిక బులియన్‌మార్కెట్‌పై పోలీసు ప్రభావం భయాందోళన వాతావరణాన్ని ఏర్పరుస్తోంది. గుర్తించలేని తరహాలో… కొందరు స్థానింగా పలుకుబడి ఉన్న వ్యక్తుల సిఫారసుతో… దొంగ సొత్తును కొంటున్నామే తప్ప… కావాలని కొనడం లేదని కొందరు వ్యాపారులు వాపోతున్నారు. అసలు దొంగ సొత్తు కొనకుండానే పోలీసు కేసు భయంతో రికవరీకి బంగారాన్ని ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కూడా… అంటున్నారు. అదేపనిగా దొంగ సొత్తును కొనే అతికొద్ది వ్యాపారులను వదిలిపెట్టి… ఆ వ్యాపారులిచ్చే తప్పుడు సమాచారంతో అరకొర వ్యాపారం చేసుకునే కొందరు నగల వ్యాపారులను పోలీసు రికవరీకి బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లివిరుస్తున్నాయి. ఈ రికవరీతో అప్పుల పాలై చాలామంది ఊరొదిలిపెట్టి పోవడం, బలవన్మరణాలకు పాల్పడటం జరిగిన సంఘటనలు ఇక్కడ లేకపోలేదు. గతంలో స్వర్ణకారులను సైతం రికవరీ కోసం పోలీసులు పట్టుకెళ్ళిన సందర్భాలు కూడా… స్థానికంగా ఉన్నాయి. తాజాగా ఈ వారంలో కరీంనగర్ సిసిఎస్ పోలీసులు ఓ మారు, ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పోలీసులు మరోమారు స్థానిక బులియన్ మార్కెట్‌పై దాడి చేసి, ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. దొంగసొత్తు మేం కొనలేదు మొర్రో…యని వ్యాపారులు మొత్తుకున్న పోలీసులే రికవరీకి బంగారం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఓ వ్యాపారి పక్షాన అతని సంబంధీకులు న్యాయస్థానంలో హెబియస్‌కార్బస్ రిట్ వేయడంతో పోలీసులు అతనిపై ఐపిసి 379, 411సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి, పోలీసులు కోర్టులో హాజరుపరిచినట్లు తెలిసింది. అంతేకాకుండా ఇక్కడి బులియన్ వ్యాపారులు మూకుమ్మడిగా ఈ పోలీసు దాడుల నుంచి తమను రక్షించాలని కోరుతూ… రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపి వివేక్‌లకు వినతిపత్రం సమర్పించారు. న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. వారు హామీ ఇచ్చిన 48గంటలు గడువకముందే… మరోసారి పోలీసుల దాడి జరిగింది. కాగా, ఈ పరంపర స్థానిక బులియన్ వ్యాపారుల మధ్య చీలిక ఏర్పడింది. పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే… అనుమానం, పోలీసులు పట్టుకెళ్తే రక్షించడం లేదని కారణం… తదితర విషయాలు వ్యాపారులను రెండుగా చీల్చింది. దీంతో సంఘంలో లుకలుకలు ఏర్పడి, బాధ్యులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు వినికిడి. ఏదిఏమైన నిత్యం కోల్‌బెల్ట్ ప్రాంతంలోని కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. గోదావరిఖని బులియన్ మార్కెట్ గత ఐదురోజులుగా మూసి ఉండటంతో… రూ.కోటి అమ్మకాలకు విఘాతం ఏర్పడింది. కాగా, బులియన్‌మార్కెట్‌పై తాము రికవరీ కోసం వెళ్ళడం లేదని, చోరీ కేసుల్లో దొరికిన దొంగలిచ్చే సమాచారంతో తాము వ్యాపారులను అదుపులోకి తీసుకుంటున్నామనే తప్ప… కావాలని ఇబ్బందిపెట్టడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే తెలుసో… తెలియకో… దొంగసొత్తును ఇక్కడి వ్యాపారులు కొనడం మాత్రం వాస్తవమని పేర్కొంటున్నారు.
‘లొసుగులతో వ్యాపారం…’
– రవీంద్రచారీ (బులియన్ వ్యాపారుల సంఘ నాయకుడు)
ఆర్థికపరమైన ఇబ్బందులతో స్థానిక నగల వ్యాపారులు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. సమస్యలను తెచ్చిపెట్టుకోవడానికి ఎవరూ… తెలిసి దొంగ బంగారాన్ని కొనడం లేదు. ఈ అక్రమ రికవరీ… వ్యాపారులను అనేక మానసిక వేదనకు గురిచేస్తోంది. భయాన్ని తెచ్చిపెడుతోంది. అసలే లొసుగుల వ్యాపారంతో… పోటీ మార్కెట్ లో అప్పుల పాలై వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాం…