నేరడిగొండలో అనిల్ జాదవ్ వర్గం రాస్తారోకో
కాంగ్రెస్ పార్టీ జెండాలు, ప్లెక్సీల దహనం
ఆదిలాబాద్,నవంబర్17(జనంసాక్షి): కాంగ్రెస్‌లో నిరసనలు మిన్నంటాయి. జిల్లాలోని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను సోయం బాపురావుకు కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీలో నిరసన జ్వాలలు మొదలయ్యాయి. శనివారం ప్రకటించిన మూడో జాబితాలో బోథ్ టికెట్‌ను సోయం బాపురావుకు కేటాయించడంతో జాదవ్ అనిల్ వర్గీయులు నేరడిగొండలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆ పార్టీ జెండాలను, ప్లెక్సీలను తగులబెట్టారు. పార్టీకి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిసిసి అద్యక్షుడు మహేశ్వర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టికెట్లను అమ్ముకున్నారని మండిపడ్డారు. పార్టీకి నిరంతరం సేవలందిస్తూ వచ్చిన అనిల్ జాదవ్‌కు టికెట్ ఇవ్వకుండా ఇటీవల పార్టీలో చేరిన సోయంబాపురావుకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీకి తగిన బుద్ధి చెబుతామని అనిల్ వర్గీయులు హెచ్చరించారు. తాము అనిల్ జాదవ్‌ను ఇండిపిండెంట్‌గా బరిలోకి దింపి గెలిపించుకుంటామన్నారు.