నేలరాలుతున్న అన్నదాతలు

4
ఒకేరోజు నలుగురు రైతుల ఆత్మహత్యలు
మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌10(జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. బుధవారం ఓ రైతు రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన నుంచి తేరుకోక ముందే మరో నలుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. రంగారెడ్డి, ఖమ్మం, నల్గోండ, వరంగల్‌ల్లో ఒక్కో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధల కారణంగా ఆర్థిక ఇబ్బందులతో ప్రతిరోజూ రైతులు ఆత్మహత్య లకు పాల్పడుతూనే ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఘన్‌పూర్‌ మండలం అప్పారెడ్డిపల్లిలో పత్తిరైతు ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మొయినా బాద్‌ మండలం సురంగల్‌లో అప్పుల బాధతో రైతు కేసరి నారాయణరెడ్డి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం సాదువెల్లిలో పత్తిరైతు కరుణాకర్‌(32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కరుణాకర్‌ ఉరివేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక కరుణకార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. అన్నదాతలు.. ఆకలి కేకలు, అప్పుల బాధతో అలమటిస్తున్నారు. దారి లేక.. దిక్కుతోచక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు  మిగతా 2లో..మారినా అన్నదాతల తలరాతలు మారడం లేదు. పంట రుణాలు ఇవ్వని బ్యాంకులు…ఉచ్చులా బిగుస్తున్న అప్పులు..వెరసి అన్నదాతలు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. రైతుల ఇంట చావుడప్పు మోగుతోంది. వర్షాభావం, కరవు, అప్పులు, బ్యాంకుల నిర్లిప్తత, గిట్టుబాటు ధరల లేమితో దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడిపోతున్నారు. ఆదుకోనే ఆపన్న హస్తం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుల బాధ తాళలేక నల్గొండ జిల్లాలో రైతు ప్రాణాలు తీసుకున్నాడు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం చింతలపాలెంలో అంతటి వెంకయ్య పురుగుల మందు తాగి ఊపిరి తీసుకున్నాడు. అప్పులు పెరగటం, రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో వెంకయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ.. మృతదేహంతో.. కుటుంబసభ్యులు, గ్రామస్తులు నాగార్జున సాగర్‌ రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.వరంగల్‌ జిల్లాలోనూ మరో రైతు బలవన్మరణం చేసుకున్నాడు. ఖిలా వరంగల్‌కు చెందిన బిల్ల శ్రీనివాస్‌ మూడు ఎకరాలలో పత్తిసాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడంతో మనస్థాపం చెందిన ఆయన పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నష్టాల సాగు, చేసిన అప్పులకు వడ్డీ కట్టలేని స్థితిలో శ్రీనివాస్‌ ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్‌ జిల్లా రైతు పెద్ద లింబయ్యది మరో దీన గాధ. చేతికందిన కొడుకు అప్పులు తీరుస్తాడని ఆశపడిన ఆయనకు పిడుగులాంటి వార్త వినిపించింది. పెద్ద కొడుకు నరేషన్‌ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో.. 3 రోజుల క్రితం హైదరాబాద్‌లోని న్యూ లైఫ్‌ ఆస్పత్రిలో అతన్ని చేర్పించాడు. వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో హతాశుడైన ఆయన బుధవారం తెల్లవారుజామునే  విద్యుత్‌ స్తంభానికి ఊరేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం జండారాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ తన పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 5 ఎకరాల భూమిలో 5 బోర్లు వేయగా.. 3 బోర్లు పాడైపోయ్యాయి. ఉన్న రెండు బోర్లు మొక్కజొన్న పంటకు చాలినన్ని నీటిని సరఫరా చేయలేకపోయాయి. పంట ఎండిపోవడంతో అప్పులు తీర్చదేలా అని మనస్తాపం చెందాడు. తన పొలంలోనే వేపచెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. కాలం కలిసిరాక అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన రైతన్నను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని రైతు సంఘాలు, మేధావులు కోరుతున్నారు.

రైతుల ఆత్మహత్యల నివారణకు కౌన్సిలింగ్‌ సెల్‌

నగరంలోని కోఠిలో గల డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి  సూసైడ్‌ కౌన్సిలింగ్‌ సెల్‌ను ప్రారంభించారు. ఆత్మహత్యల నివారణ చర్యల్లో భాగంగా కౌన్సిలింగ్‌ సెల్‌ నెం. 104ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో రకరకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. వీటిని నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.  రైతులందరికి ప్రభుత్వం అండగా ఉంటుందని,  రైతు ఆత్మహత్యలను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. గత పాలకుల విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు.  రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.