నోబెల్ విజేత మలాలాకు ఐక్యరాజ్య సమితి అత్యున్నత గౌరవం

ఐక్యరాజ్య సమితి : నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌కి ఐక్యరాజ్య సమితి సమున్నత గౌరవం దక్కింది. ఆమెను ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఎంపిక చేశారు. ఐరాస అధికార ప్రతినిధి స్టెఫానీ డుజరిక్ మాట్లాడుతూ ఇది ప్రపంచ పౌరునికి ఐరాస సెక్రటరీ జనరల్ అందజేసే అత్యున్నత గౌరవమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా బాలికా విద్యను ప్రోత్సహించడంపై మలాలా దృష్టి సారిస్తారని చెప్పారు. సోమవారం జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ పదవిని అధికారికంగా కట్టబెట్టనున్నట్లు వివరించారు.
వాయవ్య పాకిస్థాన్‌లో బాలబాలికలందరికీ విద్యా హక్కును అమలు చేయాలంటూ పోరాడుతున్న మలాలాపై గతంలో తాలిబన్ ఉగ్రవాదులు హత్యా యత్నం చేశారు. అటువంటి భయానక పరిస్థితిలో కూడా ఆమె మహిళలు, బాలికలు, ప్రజల హక్కుల పట్ల సడలని నిబద్ధతను కనబరిచారని గుటెరెస్ ప్రశంసించారు.
ఐరాస శాంతి దూతలుగా ఎంపికైనవారిలో నటులు మైఖేల్ డగ్లస్, లెనార్డో డికాప్రియో, ప్రిమటాలజిస్ట్ జేన్ గుడాల్, మ్యుజీషియన్లు డేనియల్ బారెన్‌బోయిమ్, యో యో మా ఉన్నారు.