నోయిడా ఐటి కంపెనీలో అలజడి
తోటి ఉద్యోగినిపై పదినెలలుగా వేధింపులు
బాస్‌తో సహా పలువురిపై కేసు.దర్యాప్తు చేపట్టిన పోలీసులు
నోయిడా,ఆగస్ట్14(జనం సాక్షి): ఓ ఐటీ ఉద్యోగినిపై తోటి ఉద్యోగులైన 43 మంది లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటనపై ఇప్పుడు పోలీసులు కూపీ లాగుతున్నారు. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా పది నెలల పాటు ఆమెను వేధించాక, ఇక ఆ మృగాళ్ల వేధింపులు భరించలేని ఆ అబల పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ సంఘటన నోయిడాలోని ఓ ఐటీ కంపెనీలో చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువతి నోయిడాలోని ఓ ఐటీ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగినిగా పని చేస్తుంది. ఈ క్రమంలో 2017, నవంబర్ నుంచి ఆమెను తోటి ఉద్యోగులు లైంగికంగా వేధిస్తున్నారు. ఉద్యోగులే కాకుండా ఆ కంపెనీ బాస్ కూడా ఉద్యోగినిని తనతో గడపాలని ఒత్తిడి తెచ్చాడు. మరికొందరైతే వాట్సప్‌లో అసభ్యకరమైన ఫోటోలు పంపించేవారని బాధితురాలు వాపోయింది. ఐటీ కంపెనీలోని దారుణాలపై యూపీ మహిళా కమిషన్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్కు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు నోయిడా పోలీసులను బాధితురాలి ఆశ్రయించింది. 43 మంది ఉద్యోగుల్లో బాధితురాలికి 21 మంది పేర్లు తెలియడంతో ఎఫ్ఐఆర్లో పోలీసులు వారి పేర్లు నమోదు చేశారు. మిగతా 22 మంది పేర్లను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.