నోరుజారిన పాపానికి క్షమాపణలు

అసెంబ్లీలో అశ్లీల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన మాజీమంత్రి
క్షమాపణలు కోరుతూ ట్వీట్‌ చేసిన రమేశ్‌ కుమార్‌
బెంగళూరు,డిసెబర్‌17  (జనంసాక్షి):   కర్ణాటక మాజీ స్పీకర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేఆర్‌ రమేష్‌ కుమార్‌ శుక్రవారం నాడు కర్ణాటకలో సంచలనం రేపిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. దేశం నలుమూలల నుంచీ ఆయన వ్యాఖ్యలపై వస్తున్న వ్యతిరేకతకు తలొగ్గిన ఆయన తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ లో ‘రేప్‌!‘ గురించి అసెంబ్లీలో నేను చేసిన ఉదాసీనత.. నిర్లక్ష్య వ్యాఖ్యకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా ఉద్దేశ్యం క్రూరమైన నేరాన్ని చిన్నచూపు లేదా తేలికగా చేయడం కాదు. కానీ, ఆఫ్‌ ది కఫ్‌ రిమార్క్‌! ఇకవిూదట నేను నా మాటలను జాగ్రత్తగా ఎంచుకుంటాను! అంటూ ఆయన పేర్కొన్నారు. కర్నాటక అసెంబ్లీలో గురువారం, చాలా మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని ప్రజల కష్టాలను ఎత్తిచూపుతూ వర్షం.. వరద సంబంధిత నష్టాలపై చర్చల సందర్భంగా మాట్లాడటానికి ప్రయత్నించారు. ఈ సమయంలో స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హెగ్డే కాగేరి తనకు సమయం తక్కువగా ఉన్నందున చర్చను త్వరగా ముగించాలని కోరారు. సాయంత్రం 6 గంటలకల్లా చర్చను ముగించాలని సూచించారు. అయితే, విపక్ష సభ్యులు సమయం పొడిగించాలని కోరారు. దీంతో స్పీకర్‌ తాను ఎవరు ఏమి అడిగినా అవును అని చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది. నేను పరిస్థితి నియంత్రించడం మానేసి, విూ చర్చలు కొనసాగించమని చెప్పాలా అని నవ్వుతూ ప్రశ్నించారు. షెడ్యూల్‌ ప్రకారం సభలో జరగాల్సిన కార్యక్రమాలు జరగడం లేదనేదే తన బాధ అని స్పీకర్‌ వివరించారు. ఈ సమయంలో మాజీ మంత్రి రమేశ్‌కుమార్‌ జోక్యం చేసు కుంటూ.. చూడండి.. ఒక సామెత ఉంది ? అత్యాచారం అనివార్యమైనప్పుడు పడుకుని ఆనందిం చండి. అని విూరు ఉన్న స్థానం సరిగ్గా అదే. అంటూ వ్యాఖ్యానించారు. అత్యంత జుగుప్సాకరమైన సామెతను స్పీకర్‌ స్థానానికి ముడిపెడుతూ రమేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అయింది. నెటిజన్లు మాజీ మంత్రి రమేష్‌ కుమార్‌ పై మండిపడ్డారు. మాజీ మంత్రి చేసిన ఈ వ్యాఖ లపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో రమేష్‌ కుమార్‌ శుక్రవారం తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్టు పేర్కొంటూ క్షమాపణలు చెప్పారు.