నౌక మునిగి 400 మందికి పైగా గల్లంతు
ఆసియాలోనే పెద్దదైన చైనాలోని యాంగ్జీ నదిలో భారీ నౌక ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నౌకలో ప్రయాణిస్తున్న 400 మందికి పైగా గల్లంతయ్యారు. నాలుగు అంతస్థులున్న ఈస్టర్న్ స్టార్ షిప్ దక్షిణ చైనాలోని నింజింగ్ నుంచి చోంక్వింగ్ కు బయల్దేరింది. అయితే, ప్రతికూల వాతావరణంతో తీవ్రమైన పెనుగాలులు, తుఫాను తాకిడికి గురై నది మధ్యలో మునిగిపోయింది. సమాచారమందుకున్న ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది. ఇప్పటి దాకా 20మందికి పైగా సురక్షితంగా బయటపడ్డప్పటికీ…. చాలామంది జలసమాధి అయి ఉంటారని భావిస్తున్నారు. గల్లంతయిన వారిలో 405 మంది ప్రయాణికులు, 47 మంది నౌకా సిబ్బంది, ఐదుగురు ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు. ఇంకా తుఫాను కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. షిప్ మునిగిపోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతయిన వారు క్షేమంగా రావాలని ప్రధాని ఆకాంక్షించారు.