న్యాయమడగడమే నేరమా
పర్లపల్లిపై కత్తిగట్టిన పోలీసులు ,
జీవించే హక్కును కాలరాస్తున్న కంపినీకే సర్కారు వత్తాసు ,
రోగాలపాలై బతకలేమన్న బిడ్డల అరెస్టు ,
పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా ,
కరీంనగర్, జూన్ 28 (జనంసాక్షి): కాలుష్య కారక రసాయనాల వల్ల అనారోగ్యాలకు గురవుతున్న తమకు న్యాయం కావాలన్న తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామ ప్రజలపై పోలీసులు కత్తిగట్టారు. పర్లపల్లి ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యను పరిష్కరించడం ద్వారా వారికి న్యాయం చేకూర్చాల్చిన ప్రభుత్వం ప్రజల జీవించే హక్కును కాలరాస్తున్న బయోప్లాంట్ కంపెనీకే వత్తాసు పలికింది. పోలీసులు పర్లపల్లి గ్రామంపై దాడి చేశారు. కనిపించిన వారినల్లా పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.తమ గోడు ఎందుకు పట్టించుకోవడం లేదనినిలదీసిన పాపానికి కటకటాలపాలయ్యారు. తమ గ్రామంలో స్థాపించిన హరిత బయో ప్లాంట్ వెదజల్లుతున్న కాలుష్య కారక రసాయనాలు, వ్యర్థపదార్ధాల వల్ల దుర్గంధం భరించలేకపోతున్నామని, ఈ రసాయనాల వల్ల ఊరి జనమంతా అనారోగ్యాల బారినపడ్డామని, రసాయనాలు వెలువడకుండా తగు చర్యలు తీసుకోవాలని పలుమార్లు హరిత యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోకపోవడంతో బుధవారం ఆ కంపెనీ ప్లాంట్‌పై గ్రామస్తులు సామూహిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పర్లపల్లి గ్రామంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. హరిత బయోప్లాంట్ వెదజల్లుతున్న కాలుష్యంపై గ్రామస్తుల ఆగ్రహాజ్వాలలు ఇంకా చల్లారలేదు. బుధవారం ఫ్యాక్టరీపై దాడిచేసి విధ్వంసం సృష్టించిన గ్రామస్తులు గురువారం ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతి పత్రాలు చూపించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శి జనార్దన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో 8 మంది గ్రామస్తులపై పోలీసులు కిడ్నాప్, దాడి, విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనికి నిరసనగా పోలీసు స్టేషన్ ఎదుట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. నిన్న ఫ్యాక్టరీపై దాడి చేసిన కేసులో ఇప్పటివరకు 10 మందిని ఎల్‌ఎండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో హరిత బయో ఫ్లాంట్ ఏర్పాటులో అనుమతులకు సంబంధించి రికార్డులను చూపించాలని గురువారం పలువురు గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి జనార్దన్‌ను డిమాండ్ చేశారు. సంబంధిత రికార్డులు తన నివాసంలో ఉన్నాయని ఆయన సమాధానం ఇవ్వడంతో ఒక ఆటోలో బలవంతంగా ఆయనను ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శిపై వారు దాడి చేశారు.
ఈ బయోప్లాంట్ వెదజల్లుతున్న రసాయనాలు, వ్యర్థపదార్ధాల వల్ల దుర్గంధం వ్యాపిస్తోందని, ఈ రసాయనాల వల్లనే వల్ల ఇదిలాఉండగా హరిత బయో ఫ్లాంట్ వెదజల్లుతున్న కాలుష్యం, ఫ్యాక్టరీపై గ్రామస్తుల దాడి, ఆందోళన కారులపై పోలీసులు కేసులు నమోదు చేయడం లాంటి అంశాలను పరిశీలించి బాధితుల పక్షాన నిలిచేందుకు సీపీిఐ, తెలంగాణ భూరక్షణ సంఘం ప్రతినిధి బృందాలు గురువారం పర్లపల్లిని సందర్శించాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి నేతృత్వంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె. రామ్‌గోపాల్‌రెడ్డి, బోయిని అశోక్, నగర కార్యదర్శి కె. సృజన్‌కుమార్, మానకొండూర్ మండల పార్టీ కార్యదర్శి ఎన్. శ్రీనివాస్, తెలంగాణ భూరక్షణ సమితి నాయకులు మార్వాడి సుదర్శన్, గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హరిత బయో ఫ్లాంట్ యాజమాన్యం బిస్కట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని నమ్మబలికి, గ్రామ సభ అనుమతి లేకుండానే సర్పంచ్‌తో కుమ్మక్కై అనుమతులు సాధించారని చెప్పారు. బుధవారం ఈ విషయమై యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వెళ్ళి శాంతియుతంగా ఆందోళన చేస్తుండగా యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లనే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని దాడికి కారణమయ్యాయని వివరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఈ మొత్తం ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించిన ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేశారు. బుధవారం నాటి ఘటనలో ఆందోళన కారులపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తి వేయాలని కోరారు. ఆందోళనకారుల పక్షాన నిలబడి పోరాడుతామని హామీ ఇచ్చారు. యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్లనే గ్రామస్తులు ఫ్యాక్టరీపై దాడి చేయాల్సి వచ్చిందని చెప్పారు.