న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా
న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ప్రధానిగా ఎనిమిది ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఆయన.. ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికల గురించి ఇప్పుడేం ఆలోచించలేదని.. కుటుంబ కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లింగ్టన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. భవిష్యత్తులో ప్రధాని పదవికి మళ్లీ పోటీ చేయనని చెప్పారు. జాన్ కీ డిసెంబర్ 12న అధికారికంగా తన పదవికి రాజీనామా చేయనున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ డీలర్‌గా పనిచేసేవారు. 2008లో నేషనల్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తదుపరి ప్రధాని ఎంపికపై నేషనల్ పార్టీ డిసెంబర్ 12న సమావేశం నిర్వహించనుంది. జాన్ కీ స్థానంలో మరొకరిని ఎంపిక చేసేంతవరకు డిప్యూటీ ప్రధాని బిల్ ఇంగ్లీష్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.