పంచాయతీ ఎన్నికలకు సుప్రీం పచ్చజెండ

బీసీలకు 34 శాతం కోటాకు ఓకే

2001 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి):
స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఎన్నికల నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపిం ది. ప్రస్తుత రిజర్వేషన్ల విధానం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రిజిర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుంటూనే… ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను కొనసాగిం చాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని… నిర్ణీత వ్యవధిలోగా ఎన్నికలు నిర్వహించక పోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ప్రస్తుతానికి రిజర్వేషన్ల వివాదాన్ని పక్కన బెట్టాలని, ముందుగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్ల అమలుకు కోర్టు అవకాశం కల్పించింది. అందుబాటులో ఉన్న జనాభా లెక్కల (2001) ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని జస్టిస్‌ కె.సదాశివ్‌, జస్టిస్‌ జగదీశ్‌సింగ్‌ కేహర్‌లతో కూడిన ధర్మాసనం  సూచించింది. బీసీ జన గణన పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదన్నది కేవలం విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మాత్రమే పరిమితమని జస్టిస్‌ సదాశివ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రంలో 2006లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2011లో వాటి పదవీ కాలం ముగిసింది. ఈ లోగా బీసీ రిజర్వేషన్లపై వివాదం తలెత్తింది. దీంతో 2011 జూలైలో నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2006 నాటి రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. సహకార సంస్థల ఎన్నికల్లో విజయంతో ఊపు విూదున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సమాయాత్తమవుతోంది.
బీసీ సంఘాల ఒత్తిడి మేరకు ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 22.5 శాతం నుంచి 33.3 శాతానికి పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 60.5 శాతానికి చేరింది. అయితే, దీన్ని సవాలు చేస్తూ ఓబీసీ సంఘాలు, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పుబడుతూ, ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం… ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టం చేసింది. అలాగే, రిజర్వేషన్ల కేటాయింపుపైనా హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీసీ జన గణన పూర్తి చేయకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తారని ప్రశ్నించింది. ముందుగా జన గణన పూర్తి చేసి, ఆ తర్వాత రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలించాలని ఆదేశించింది. అదే సమయంలో తాజా లెక్కల (2011 జన గణన) ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వం 2001 జనాభా గణన లెక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2011 జనాభా లెక్కలు ఇంకా అందలేదు. మరోవైపు, రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకొనేది లేదని బీసీ వర్గాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. స్పష్టమైన మార్గ నిర్దేశకాలు జారీ చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. 2011 జూలైలో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని వివరించింది. ఎన్నికలు జరగక పోవడం వల్ల దాదాపు రూ.18 వేల కోట్ల నిధులు నిలిచిపోయాయని పేర్కొంది. అలాగే, పాలక మండళ్లు లేక అభివృద్ధి పనుల అమలులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోందని తెలిపింది. హైకోర్టు తీర్పు ఆదేశాలపై స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేయాలని, ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. స్థానిక సంస్థల పాలక మండళ్ల కాల పరిమితి ముగిసి చాలా కాలమైందని.. ఈ నేపథ్యంలో ముందుగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించక పోవడం రాజ్యాంగ విరుద్ధమని.. ప్రస్తుతానికి రిజర్వేషన్ల అంశాన్ని పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. అందుబాటులో ఉన్న జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు వెళ్లాలని ఆదేశించింది. 50 శాతం రిజర్వేషన్లు అన్నది ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలకే పరిమితం అని జస్టిస్‌ సదాశివం వ్యాఖ్యానించడం విశేషం.