పంచాయితీలను ఆర్థికంగా బలోపేతం చేయాలి

కరీంనగర్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలను

వికేంద్రీకరించి వాటిని బలోపేతం చేయడం ద్వారా గ్రామాలను పరిపుష్టం చేయాలని భాజపా కిసాన్‌ మోర్చా జాతీయ ప్రధానకార్యదర్శి సుగుణాకర్‌ రావు డిమాండ్‌ చేశారు. సర్పంచుల సంఘం కోరుతున్న మేరకు పంచాయితీలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. గ్రామజ్యోతి, మన వూరు- మన ప్రణాళిక

తదితర కార్యక్రమాలు ఆర్భాటంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయకుండా, సర్పంచులకున్న అధికారాలు హరించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేరళ తరహాలో పంచాయతీల పాలన ఉంటుందని, సర్పంచులకు సర్వ హక్కులుంటాయని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. కానీ పి/-పుడు మరోమారు ప్రత్యేక పంచాయితీ చట్టం తేవాలని చూస్తున్నారని అన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన విద్యుత్తు బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని,

ఎస్‌ఎఫ్‌సీ నిధులతో పాటు మైనింగ్‌, ఇసుక, సీనరేజి, స్టాంపు, తలసరి తదితర పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీలకు ఆదాయవనరులు పెంచేలా చేయాలన్నారు. అన్ని పంచాయతీలకు గ్రామ కార్యదర్శులను నియమించాలని, ఎక్కడ లేని విధంగా జిల్లాల్లో సర్పంచులకు జాయింట్‌ చెక్‌ పవర్‌ను తొలగించాలని, గౌరవ వేతనం సక్రమంగా చెల్లించాలని కోరారు.