పంచాయితీల్లో మొక్కల పెంపకం తప్పనిసరి
కామారెడ్డి,జూలై21(జనం సాక్షి): పంచాయతీ రాజ్ నూతన చట్టం ప్రకారం ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటాలని జడ్పీసీఈవో గోవింద్ అన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యత పూర్తిస్థాయిలో సర్పంచులదేనని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో నాల్గో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా 3 కోట్ల 15 లక్షల మొక్కలు నాటాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో కోటీ 85 లక్షలు, కామారెడ్డి జిల్లాలో కోటీ 30 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 30 శాతం వరకు గుంతలుతీయడం పూర్తయిందన్నారు. వర్షాలు కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఆగస్టు 15వ తేదీ వరకు మండలాలకు కేటాయించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా ప్రకటించిన గ్రామపంచాయతీలు ఆగస్‌ట్టు 2వతేదీ నుంచి ఉనికిలోకి రానున్నాయని తెలిపారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన వాటితో పాటు మొత్తం 526 జీపీల్లో సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలా.. లేదంటే ప్రత్యేక అధికారులను ఏర్పాటుచేయాలా అనే నిర్ణయాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖరారుచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఉమ్మడి జిల్లాలో ఎంపీటీసీల వేతనాలు డిసెంబర్ 2017 వరకు అందించినట్లు చెప్పారు. 2018 జనవరి నుంచి ఇప్పటివరకు బకాయి ఉన్న వేతనాలను త్వరలోనే చెల్లిస్తామని స్పష్టం చేశారు.