పంచాయితీ ఎన్నికలకు ముందస్తుకసరత్తు

తుది ఓటర్ల జాబితా విడుదలకు ఏర్పాట్లు
కొత్తగా 10 పంచాయతీల ఏర్పాటు
మచిలీపట్నం,మే18(జ‌నంసాక్షి): ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇవి ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం ముందస్తు కసరత్తు  చేస్తోంది. కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సంసిద్ధులయ్యారు. ఇప్పటికే పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఈనెల 10న ఓటర్ల జాబితా ముద్రించాల్సి ఉండగా పలు సాంకేతిక కారణాలతో ఈనెల 20వ తేదీకి ఓటర్ల జాబితాల ముద్రణ వాయిదా పడింది. ఎన్నికల కమిషన్‌ నుంచి ఈనెల 19న ఆదేశాలు వచ్చినా మరుసటి రోజు మధ్యాహ్నానానికి ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని పంచాయతీ రాజ్‌ విభాగం అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఏ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశంపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. జిల్లాలో 970 పంచాయతీలుండగా,వీటికి తోడు తండాల్లో మరో పది పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిని కలుపుకుని ఈసారి 980 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 980 పంచాయతీలు, 9918 వార్డుల్లో 23 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈనెల 20వ తేదీ నాటికి పంచాయతీల్లో ఓటర్ల జాబితా ముద్రణ పూర్తయితే వీటి వివరాలను ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయాలతో పాటు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో పెట్టనున్నారు. పంచాయతీలు, అందులోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఉంటుంది. ఓటరు వాస్తవంగా ఉంటున్న పంచాయతీలో తన పేరు లేకుండా పక్కన ఉన్న పంచాయతీలోని జాబితాలో పేరుంటే సవరణకు అవకాశం ఇస్తారు. గతంలో పట్ణణ ప్రాంతంలోనూ, గ్రావిూణ ప్రాంతంలోనూ రెండు చోట్ల ఓట్లు ఉండేవి. ఓటరు జాబితాకు ఆధార్‌ అనుసంధానం చేయడంతో ఏదైనా ఒక ప్రాంతంలోనే ఓటుండేలా చర్యలు తీసుకున్నారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి ఓటర్ల జాబితాల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకే ఓటరు పేరు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు, రెండు, మూడు ప్రాంతాల్‌ల్లో నమోదై ఉన్నాయి. వీటన్నింటిని సరి చేస్తే పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య కొంతమేర తగ్గే అవకాశం ఉంది.