పంచాయితీ ఏర్పాట్లలో అధికారుల బిజీ
నోటిఫికేషన్ ఆధారంగా ముందుకు
కరీంనగర్,డిసెంబర్14(ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలోని అన్ని పంచాయతీల ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకు కావాల్సిన పోలింగ్ డబ్బాలను సైతం మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి తెప్పించి సిద్ధం చేసి ఉంచారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ సైతం పూర్తి అయ్యింది. ఎన్నికల నిర్వహణ కోసం గతంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు రెండు సార్లు శిక్షణ నిర్వహించారు. గత పంచాయతీ ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎన్నికల్లో బీసీల రిజర్వేన్ల శాతం 11 శాతం మేర తగ్గనుంది. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 60.55 శాతంతో ఎన్నికలు జరిగాయి. సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని స్పష్టమైన తీర్పు వెల్లడించింది. దీంతో గతంలో 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లు ఈసారి 23.81కు తగ్గనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రెండు, మూడు రోజుల కిందటనే రాష్ట్ర హైకోర్టు సైతం ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం లేదని తీర్పు వెల్లడించింది. ఇక కొత్తగా అధికారం చేపట్టిన ప్రభుత్వం సైతం న్యాయస్థానం తీర్పు ప్రకారమే ఎన్నికల నిర్వహణకు వెనువెంటనే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికార యాంత్రాంగానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికలకు ముహూర్తం ఏ క్షణంలోనైనా ఖరారు కావచ్చు.జిల్లాలో పంచాయతీల వారీగా, స్త్రీ, పురుషులతో పాటు బీసీ ఓటర్ల తుది జాబితాను విడుదల చేయడానికి సంబంధిత శాఖల సిబ్బంది నిమగ్నమయ్యారు. జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటు నాటికి 276 ఉండగా, కొత్తగా మరో 54 పంచాయతీలు ఏర్పాటయ్యాయి. 330 పంచాయతీల్లో రెండు నగర పంచాయతీలుగా ఏర్పాటు కాగా, మరో 15 పంచాయతీలు కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు హుజురాబాద్, జమ్మికుంట నగర పంచాయతీల్లో విలీనమయ్యాయి. 15 పంచాయతీలకు సంబంధించిన పాత పంచాయతీల పాలకవర్గాలు, కొందరు గ్రామస్థులు విలీనాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంలో ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో ఈ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగించి, ప్రభుత్వం మార్గం సుగమం చేయాల్సి ఉంది. లేదంటే 313 పంచాయతీలకే ఎన్నికలు నిర్వహించాల్సి రావచ్చు.