పంజాబ్లో కుప్పకూలిన శనిదేవుని ఆలయం
తృటిలో తప్పించుకున్న కార్మికులు
ఫరీద్కోట్,జూలై14(జనం సాక్షి): పంజాబ్లోని ఫరీద్కోట్లోగల అత్యంత పురాతన శనిదేవుని ఆలయం ఉన్నట్టుండి కూలిపోయింది. ఆలయాన్ని జాక్ సిస్టమ్ ద్వారా పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు తృటిలో ప్రాణాలు దక్కించుకోగలిగారు. ఆలయంలోని శనిదేవునికి తైలాభిషేకం చేసేందుకు వచ్చిన భక్తులను ఆలయ సిబ్బంది కొద్దిసేపు ఆపిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు కూలీలు పరిగెత్తి బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు సుభాష్ చంద్ర మాట్లాడుతూ శనిదేవుని మందిరం కొంచెం కిందకు ఉండటంతో నీటితో నిండిపోతున్నదన్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కొందరు గాయాలపాలవుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఆలయాన్ని జాక్ సిస్టమ్తో పైకి తీసుకురావాలని భావించాం. పాటియాలకు చెందిన నిపుణులు ఈ పని చేస్తుండగా, బ్యాలెన్స్ తప్పి ఈ ఘటన సంభవించిందని తెలిపారు.