పంజాబ్‌,హర్యానా రైతుల్లో ఆనందం

మోడీ నిర్ణయంపై కెప్టెన్‌ అమరీందర్‌ హర్షం

చండీఘడ్‌,నవంబర్‌19(జనం సాక్షి ): అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వెల్లడిరచారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాల్లోనూ వెనక్కి తగ్గని మోదీ సర్కార్‌.. అన్నదాతల ఆగ్రహానికి తలొగ్గింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. నూతన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కిసాన్‌ ఉద్యమాలు హోరెత్తించాయి. ముఖ్యంగా  పంజాబ్‌, హర్యానా రైతులు ప్రధాని ప్రకటనతో ఇక ఆనందంలో తేలారు. సీఎం కేసీఆర్‌ నేపథ్యంలోనూ తెలంగాణ సర్కార్‌ కూడా రైతు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశ్‌ పర్వదనం పూట ప్రధాని వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని, రైతులకు క్షమాపణలు చెప్పారని అన్నారు. ఇంతకంటే పెద్ద విషయం ఇంకేవిూ ఉండదని పేర్కొన్నారు. ఎట్టకేలకు రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి, హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పారని, ఇక పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మిగిలిందని అమరీందర్‌ చెప్పారు. ఈ నెల 29న పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఈ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో సమస్య పరిస్కారం అయినట్లేనని వ్యాఖ్యా నించారు. ప్రధాని స్పష్టంగా ప్రకటన చేసిన తర్వాత కూడా రైతులు ఆందోళన కొనసాగిస్తామనడంలో అర్థం లేదన్నారు. రైతుల సమస్య పరిష్కారం తర్వాతే బీజేపీతో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటానని గత మూడు నెలల నుంచి చెబుతూ వచ్చానని ఆయన గుర్తుచేశారు.