పంజాబ్‌ ఐఎఎస్‌లకు ఎన్నికల విధులు

వివిధ రాష్ట్రాల ఎలక్షన్‌ డ్యూటీకి అధికారులు

చండీఘర్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న అధికశాతం ఐఎఎస్‌లలో పలువురు ఈ నెలలో అందుబాటులో ఉండరని సమాచారం. నవంబరు 12 నుండి డిసెంబరు 7 వరకు ఐదురాష్ట్రాలైన రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, మిజోరాం, తెలంగాణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో

పరిశీలకులుగా నియమించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని 180 మంది ఐఎఎస్‌ అధికారులలో 60 మంది అధికారులను భారత ఎన్నికల కమిషన్‌ పరిశీలకులుగా నియమించినట్లు పేర్కొంది. ఐఎఎస్‌ అధికారులందరూ 1990- 2010ల మధ్య ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారిని ఎంపిక చేసింది. అధిక సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులు ఏకకాలంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా వెళ్తున్నారని, షెడ్యూల్‌ను అనుసరించి వేరు వేరు తేదీలలో వారు ఆ రాష్ట్రాలకు చేరుకుంటారని రాష్ట్ర సెక్రటరీ పర్సనల్‌ ఎఎస్‌ మిగ్లని తెలిపారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్గఢ్‌ పెద్ద రాష్ట్రాలు కావడంతో పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికల కోసం ఐఎఎస్‌ అధికారులు పనిచేయాల్సి వస్తోంది. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, క్యాబినెట్‌ మంత్రి నవ్జోత్‌ సింగ్‌ సిద్ధూ కూడా ఎన్నికల ప్రచార నిమిత్తం వెళతారని పిపిసిసి అధ్యక్షుడు సునీల్‌ జఖార్‌ తెలిపారు. ఇతర క్యాబినెట్‌ మంత్రులు కూడా ప్రచారంలో చురుకుగా పాల్గంటున్నట్లు ఆయన తెలిపారు.