పంటలబీమాపై అవగాహన కరవు
అకాల వర్షాలతో నష్టపోయిన వారికి పరిహారం అనుమానమే
జగిత్యాల,ఏప్రిల్22(జనంసాక్షి): అకాల వర్షాలతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ చేతికందే దశలోని పంటలు దెబ్బతినడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. మామిడిలో కాయలు నేలరాలగా గొలక దశలోని
వరిపైరులో గింజలు నేలరాలడంతో నష్టం చాలా ఎక్కువగా ఉంటోంది. నువ్వులు, మొక్కజొన్న, ఆవాల పంటల్లో కర్రలు విరిగి పడిపోవటం, బొప్పాయి, అరటిచెట్లు కూడా విరిగి పడిపోవటంతో కనీసం పెట్టుబడులు కూడా రైతుల చేతికందే పరిస్థితి లేదు. మామిడి, వరిలో ఎకరాకు రూ. 30 వేలకుపైగా నష్టం వాటిల్లగా మిగిలిన పంటల్లోనూ ఎకరాకు రూ. 20 వేల వరకు నష్టం జరిగింది. సరాసరిగా లెక్కించినా 21,567 ఎకరాలకుగాను ప్రతి ఎకరాకు రూ. 25వేల చొప్పున రూ. 53.91 కోట్లను రైతులు నష్టపోయారు. అధికారులు 33 శాతం దాటి నష్టపోయిన పంటలనే పరిహారానికి లెక్కించి ప్రభుత్వానికి నివేదిస్తుండగా 33 శాతంకన్నా తక్కువ నష్టం వాటిల్లిన రైతులుకూడా చాలామందే ఉన్నారు. సాధారణంగా ప్రకృతి ప్రకోపంతో పైర్లకు నష్టం వాటిల్లితే పంటలబీమా పరిహారాన్ని మంజూరివ్వాలి. కానీ ఈ రబీలో 75 శాతం మంది రైతులు పంటలబీమా ప్రీమియం చెల్లించనందున వీరు పరిహారానికి నోచుకునే అవకాశాలు కనిపించడం లేదు. పరిహారం చెల్లించిన వారికీ నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయి. పంటనష్టం వాటిల్లిన రెండు రోజుల్లోపు నష్టతీవ్రత తెలిపే ఫొటోలను బీమా కంపెనీకి పంపాలి. కానీ రైతులకు అవగాహన లేకపోవటం, అధికారులు అంతగా పట్టించుకోనందున బీమా పరిహారం మంజూరు అనుమానంగానే మారింది. మరోవైపు బీమా రాని రైతులకు రాష్ట్రప్రభుత్వం పెట్టుబడి రాయితీని మంజూరివ్వాలి. ఇందుకుగాను 33 శాతం దాటి నష్టపోయిన పంటల వివరాలను సేకరించి అధికారులు నివేదించినా ప్రభుత్వం పెట్టుబడి రాయితీని మంజూరివ్వడంలేదు. గత కొన్ని సీజన్లుగా జిల్లా రైతులకు పెట్టుబడి రాకపోగా ఈ సీజన్‌లోనూ పరిహారం మంజూరు అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పంటనష్టం జరిగినపుడు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నేతలు రైతుల క్షేత్రాలను సందర్శిస్తుండగా తదుపరి వివరాలను విస్మరిస్తున్నందున పరిహారం మంజూరు కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ప్రభుత్వంనుంచి పెట్టుబడి రాయితీని లేదా పంటలబీమా పరిహారాన్ని మంజూరిప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.ఈ రబీ కాలంలో రైతులను అకాలవర్షాలు వెన్నాడుతూ తీరని పంటనష్టం కలిగిస్తున్నాయి. గత నాలుగైదు జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం, పలు మండలాల్లో వడగళ్లు పడటంతో పైర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నీటి ఎద్దడిని అధిగమిస్తూ కష్టించి పండించిన పంటలు నేలపాలు కావటంతో కర్షకులు తల్లడిల్లుతున్నారు. ఫిబ్రవరి నుంచి వరుసగా రాళ్లవానలు కురుస్తుండగా ఇప్పటికే జిల్లా రైతులకు రూ.53.91 కోట్లకుపైగా నష్టం వాటిల్లడం సర్కారు ఆదుకోవాల్సిన ఆవశ్యకతను వెల్లడిస్తోంది.