పండగలపై ఆంక్షలు విధించండి


` హైకోర్టు ఆదేశం
` మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది
` రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌,డిసెంబరు 23(జనంసాక్షి): ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్‌మస్‌, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేడుకల్లో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తూ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతోందని.. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదని రవిచందర్‌, చిక్కుడు ప్రభాకర్‌, పవన్‌ కుమార్‌ తదితర న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో పలు ఉత్సవాల్లో జనం భారీగా గుమిగూడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.దీనిపై స్పందించిన ధర్మాసనం వేడుకలను నియంత్రించాలని ఆదేశించింది. దిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయని విచారణ సందర్భంగా ప్రస్తావించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందకుండా.. సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన బస్‌ స్టేషన్ల వద్ద స్క్రీనింగ్‌ పరీక్షలు జరపాలని.. గత నెల 21న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామన్న హరీష్‌రావు
రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కట్టడి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఒమైక్రాన్‌ కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్ట్‌లో విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ టెస్ట్‌ చేస్తామన్నారు. కేంద్రం బూస్టర్‌ డోస్‌, చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌పై స్పందించడం లేదన్నారు. ఇతర దేశాలు బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఒమిక్రాన్‌ కట్టడికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు వెల్లడిరచారు. హైకోర్టు ఆర్డర్‌ ఇంకా అందలేదని, అందిన వెంటనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

 

తాజావార్తలు