పండ్లతోటలపై భానుడి ప్రతాపం

ఆందోళనలో రైతులు
కడప,మార్చి5(జ‌నంసాక్షి): ఎండల తీవ్రత పెరగడంతో  ప్రజలు అల్లాడుతుంటే పండ్ల తోటలకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వర్షాధారంతో సాగు చేసిన పలు తోటలు నీరందక ఎండిపోయే దుస్థితి నెలకొంది.  దీంతో దీర్ఘకాలిక పంటలైన అరటి, బొప్పాయి సపోటా, పనస, జామ, నిమ్మ పంటలు ఎండిపోతున్నాయి. ఈ పంటలకు సాగునీరు అందక రైతులు
అల్లాడుతున్నారు. తోటల్లో ఆశించిన మేరా దిగుబడి ఉన్నప్పటికీ నీరు అందక పోవడంతో దిగుబడి వున్న అరటి చెట్లు ప్రస్తుతం వీస్తున్న గాలులకు నేలకూరుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.80 నుండి 90 వేలు ఖర్చు చేసినా ఫలితం లేదని దిగాలు చెందుతున్నారు. వివిధ ప్రాంతాల్లో సాగుచేసిన పండ్ల తోటల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గతంలో కురిసిన వర్షాలతో దీర్ఘకాలిక పంటలను రైతులు సాగుచేసారు. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో భూగర్బ జలాలు అడుగంటిపోయి నీరు అడుగంటి పోయింది.ఆధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమని రైతులు వాపోతున్నారు. వేల హెక్టార్లలో అరటి, బొప్పాయి సాగులో ఉన్నట్లు ఆధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే నీటి కొరత
కారణంగా వందల హెక్టార్లలో అరటి, బొప్పాయి తోటలు నిలువున్నా ఎండి పోయాయని రైతులు ఆందోళన చెందుతుతున్నారు. తోటలను కాపాడుకు నేందుకు  బోర్లు వేసినా భూగర్బంలో తేమకూడా బయటకు రాలేదన్నారు. ఇప్పటికైనా పండ్ల తోటల రైతులను ఆదుకోవాలని మండలంలోని అన్నదాతలు వేడుకుంటున్నారు. పంటతడులతో వీటిని కాపాడాలని కోరుతున్నారు.