పకడ్బందీగా చెక్కుల పంపిణీ కార్యక్రమం:కలెక్టర్‌ అమయ్‌కుమార్‌


జయశంకర్‌ భూపాలపల్లి,జ‌నం సాక్షి ): రైతుబంధు పథకంలో భాగంగా ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న రైతులకు అందించే పంటసహాయం చెక్కుల పంపిణీని పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. బ్యాంకుల వద్ద ఎటువంటి గలాటాలు జరగకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని అధికరాఉలను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖఅధికారి అనురాధకు స్పష్టమైన ఆదేవాలు ఇచ్చారు.అలాగే నిజమైన లబ్ధిదారులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చెక్కులను అందించేలా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బినావిూలు ఉంటే వెంటనే గుర్తించి రిపోర్టు అందచేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. రైతులు ఏయే పంటలను పండించాలి, ఎటువంటి ఫలితాలు వస్తాయి, దళారుల మాటాలను నమ్మవద్దని వివరించే బాధ్యతలను రైతు సమన్వయ సమితి కార్యకర్తలు తీసుకుని నిర్వర్తించాలని కోరారు. ఇకపోతే ప్రతి గ్రామంప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండి తీరాలని, లేదంటే గడువు ముగిసిన వెంటనే మరుగుదొడ్డిలేని ఇంటికి రేషన్‌, కరెంట్‌ నిలిపివేయాలని సూచించారు. ఈ విషయాలపై చివరి ప్రయత్నంగా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్డి అవసరం గురించి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పి నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు గ్రామాల్లో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.

నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు పూర్తిస్థాయిలో పన్నుల వసూలు జరిగిన తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామానికి మొదటి బహుమతిగా రూ. 10లక్షలు, వెంకటాపురం మండలం నల్లగుంట గ్రామానికి ద్వితీయ బహుమతిగా రూ.7.50లక్షలు. గోవిందరావుపేట మండలం బుస్సాపూర్‌ గ్రామానికి తృతీయ బహుమతిగా రూ.5లక్షలు ఇటీవల అందచేశారు. వీటిని చూపి మితగతా గ్రామాలను ప్రోత్సహించాలని అన్నారు. అక్టోబర్‌ 2వ తేదీలోగా జిల్లాలో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా ఎంపీడీవోలు ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన కుటంబాలకు ప్రభుత్వం నుంచి రేషన్‌, కరెంట్‌ను కట్‌ చేయడంతోపాటు ప్రభుత్వ పథకాలను సైతం అందించకూడదని చెప్పారు.