పక్కాగా కందుల కొనుగోళ్లు
ఆదిలాబాద్,ఫిబ్రవరి18(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కంది కొనుగోళ్ల విషయంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. దాదాపు 2 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడులు వస్తాయని అంచనా వేసిన అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోకుండా ముందస్తు ప్రణాళికలతో పంటను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యాపారులు కందులను క్వింటాకు రూ.4500 చొ ప్పున కొనుగోలు చేస్తుండగా.. ప్రభుత్వ కేంద్రాల్లో రై తులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5450 లభిస్తుంది. దీంతో రైతులు ప్ర భుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను విక్రయానికి తీసుకొస్తున్నారు. మార్కెట్ యార్డుల్లోకి తీసుకొచ్చిన పంటను అధికారులు దగ్గరుండి పంట నాణ్యతను, ఇతర పత్రాలను పరిశీలిస్తున్నారు. వివిధ మార్కెట్‌యార్డుల్లో పంటను విక్రయానికి తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో కందుల విక్రయాలు భారీగా సాగుతున్నాయి. మార్క్‌ఫెడ్, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ల ద్వారా రైతుల నుంచి కందులను సేకరించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైతులకు ముందుగానే టోకెన్లు జారీ చేసి, అందులో సూచించిన రోజు పంటను మార్కెట్‌కు విక్రయానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. టోకెన్‌తో పాటు వీఆర్వోలు, ఏఈవోలు ధ్రువీకరించిన పత్రాన్ని సైతం మార్కెట్‌యార్డు సిబ్బంది పరిశీలిస్తున్నారు.