పగటిపూట ర్యాలీలు..రాత్రిపూట కర్ఫ్యూలా..!


` భాజపాకు చురకలంటించిన బీజేపీ ఎంపీ వరుణ్‌
న్యూఢల్లీి,డిసెంబరు 27(జనంసాక్షి):భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్‌ గాంధీ మరోసారి సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు. దేశంలో ఓవైపు ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతూ ఉంటే, ఉత్తర ప్రదేశ్‌లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తుండటంపై గట్టిగా నిలదీశారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడం, పగటి సమయంలో లక్షలాది మందిని బహిరంగ సభలకు పిలవడం ఏమిటని ప్రశ్నించారు. వరుణ్‌ గాంధీ సోమవారం ఇచ్చిన ట్వీట్‌లో, రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడం, పగటి సమయంలో లక్షలాది మందిని బహిరంగ సభలకు పిలుస్తుండటం, ఇది సామాన్యుడి అవగాహనా సామర్థ్యానికి అతీతమైనదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం డిసెంబరు 25 నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తోంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. దీనివల్ల ఉపయోగం ఏమిటని వరుణ్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పరిమితంగా ఉందని, భయానకమైన ఒమైక్రాన్‌ వ్యాప్తిని ఆపడానికి ప్రాధాన్యమివ్వాలో, ఎన్నికల్లో బలాన్ని ప్రదర్శించడానికి ప్రాధాన్యం ఇవ్వాలో మనం నిజాయితీగా నిర్ణయించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఘజియాబాద్‌లో డిసెంబరు 25న జన విశ్వాస్‌ యాత్రలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న సభలకు కూడా ఆయన హాజరవుతున్నారు. ప్రధాని మోదీ డిసెంబరు 23న నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో దేశవ్యాప్తంగా ఒమైక్రాన్‌ పరిస్థితి, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధతల గురించి సవిూక్షించారు. కోవిడ్‌`19 రూపాంతరమైన ఒమైక్రాన్‌ విషయంలో మనమంతా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. ఇదిలావుండగా, శాసన సభ ఎన్నికలు సవిూపిస్తుండటంతో ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీలు ప్రచార సభలను నిర్వహిస్తున్నాయి. ప్రజలను పెద్ద ఎత్తున సవిూకరిస్తున్నాయి.