పటిష్ట పంచాయితీ వ్యవస్థ అసవరం
కేరళ తరహా విధానం మేలంటున్న నేతలు
అమరావతి,ఫిబ్రవరి1 (జనం సాక్షి): పంచాయతీల్లో పన్నుల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఒక పరిశీలనలో వెల్లడైంది. కేరళ తరహా విధానం అవలంబించాలని సిపిఎం నేతలు సూచిస్తున్నారు. కొత్త భవనాలకు ఆస్తి పన్ను విధింపు, ఉన్న పన్నులను ప్రతి అయిదేళ్లకోసారి సవరించాలన్న ఆదేశాలు పంచాయతీల్లో అమలుకు నోచుకోవడం లేదు. ఆర్థిక సంఘ నిధులు, దస్తావేజుల రిజిస్టేష్రన్లపై వచ్చే స్టాంపు డ్యూటీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్రాంట్లతోనే అత్యధిక పంచాయతీలు సరిపెట్టుకుంటున్నాయి. కేరళ, కర్ణాటక వంటి రాష్టాల్ల్రో పంచాయతీలు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నాయంటే పన్నుల వ్యవస్థ పటిష్ఠంగా ఉండటమే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలోని 12,918 పంచాయతీలకు ఆస్తి పన్ను, పన్నేతర రుసుముల కింద ఏటా రూ.732కోట్లకుపైగా ఆదాయం వస్తున్నట్లు గణాంకాలున్నాయి. కానీ, 50శాతంనుంచి 60శాతానికి మించి అందులో వసూలు కావడం లేదు. పాలకవర్గాలు పట్టించుకోకపోవడం, ప్రజల సహకారం కొరవడటమే ఇందుకు కారణం అని భావిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సాయం అవసరం కాగా, ఇప్పటికే అనేక కార్యక్రమాలు రూపొందించినప్పటికీ వాటికి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. తద్వారా పనులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. పట్టణ తరహా గ్రావిూణాభివృద్ధి (రూర్బన్) కార్యక్రమం కోసంరాష్ట్రంలోని విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని అయిదు పంచాయతీలను గతంలో ఎంపిక చేశారు. రూ.135 కోట్లతో ఆయా గ్రామాల్లో వివిధ పనుల నిర్వహణకు వీలుగా కార్యాచరణ రూపొందించారు. ఇందులో కేంద్రం 60శాతం, రాష్ట్రం మిగతా 40 శాతం నిధులు సమకూర్చేందుకు ఒప్పందం కుదిరింది. అయినా ఈ పనులు పూర్తి చేయని పరిస్థితి నెలకొంది. నిధులు గడువులోగా ఖర్చు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. కేంద్రం కూడా నిధులు సకాలంలో విడుదల చేయాలి. స్వచ్ఛభారత్‌లో భాగంగా గ్రావిూణ ప్రాంతాల్లో ఇప్పటికే 32 లక్షల కుటుంబాల కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. ఇళ్ల నుంచి చెత్తతోపాటు పశువుల పేడనూ సేకరించి వాటి ద్వారా ఏటా రూ.600 కోట్ల సంపద సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించారు. పన్నేతర రుసుము వసూళ్లు, అందులోని లొసుగులను సవరిస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా ఆ దిశగా గ్రామ పంచాయతీలు దృష్టి సారించడం లేదు. రెండు జిల్లాలను ఇప్పటికే బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా 11 జిల్లాలపైనా దృష్టి పెట్టింది. భారీగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నా వాటి నిర్వహణ చాలా జిల్లాల్లో అధ్వానంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వీటికి కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేస్తే మరిన్ని ఫలితాలు సాధించొచ్చని భావిస్తున్నారు.