పట్టణ సచివాలయాలతో నిరుద్యోగులకు ఉపాధి

459 వార్డు సచివాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం
గుంటూరు,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : ప్రభుత్వ సంక్షేమ పథ కాలను క్షేత్ర స్థాయిలో నేరుగా ప్రజలకు
అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను రూపుది ద్దుతోంది. గ్రావిూణ ప్రాంతాల్లో రెండు వేల మందికి ఒకటి చొప్పున సచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పట్టణాల్లో ఆ పరిమితిని నాలుగు వేలకు పెంచింది. నాలుగు వేల జనాభాకు ఒక వార్డు సచివాల యం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 12 పురపాలక సంఘాలు, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 459 వార్డు సచివాలయాలఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా ఆయా వార్డుల్లో ఉన్న ప్రభుత్వ భవనాలలో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో పట్టణ సచివాలయాల ఏర్పాట్లపై మున్సిపల్‌ కమిషనర్లతో సవిూక్షించారు. క్షేత్రస్థాయిలో సచివాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాల పరిశీలనలో కమిషనర్లు, మున్సిపల్‌ సిబ్బంది నిమగ్నమయ్యారు. పట్టణ ప్రాంతాల్లో 4 వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక వేళ వార్డులో (ప్రాంతంలో) 3 వేల జనాభా ఉంటే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఆరు నుంచి ఎనిమిది వేల జనాభా ఉంటే రెండు
సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒక డివిజన్‌ (కార్పొరేటర్‌ పరిధి)లో 10 వేల వరకూ జనాభా ఉండే అవకాశాలు ఉన్నాయి. అటువంటి చోట 2 నుంచి 3 సచివాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 12 పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలో, గ్రావిూణ ప్రాంతాల్లో 2011 జనాభా లెక్కలను దృష్టిలో ఉంచుకొని సచివాలయాలను ఖరారు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో జనాభా పెరుగుదల ఏటా 10.98 శాతంగా ఉంది. దానిని ప్రాతిపదికగా తీసుకొని 2011 జనాభా ప్రకారం ఇప్పుడు జిల్లాలోని 12 పురపాలక సంఘాలు, గుంటూరు నగరపాలక సంస్థలో జనాభాపై అంచనాలు వేశారు. వాటి ప్రకారం సుమారు 459 పట్టణ సచివాలయాలు ప్రారంభించాల్సి ఉంటుందని సూతప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు.