పట్టభద్ర ఎమ్మెల్సీలో మామిండ్లకు టిఆర్‌ఎస్‌ మద్దతు

కరీంనగర్‌,మార్చి8(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిని పోటీలో పెట్టబోమని టీఆర్‌ఎస్‌ ప్రకటించినప్పటికీ కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు టిఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు ఎంపీ కవిత కూడా ఆయనకు ఆశీస్సులు అందించారు. కరీంనగర్‌లో ఆయన కేటీఆర్‌ను కలవగా పార్టీ నేతల సమక్షంలో గౌడ్‌కు మద్దతు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఇప్పటికే జిల్లాల్లో ప్రచారం సాగిస్తున్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలు ఆయనకు మద్దతుగా ప్రచారంలో
పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా సుగుణాకర్‌రావు బరిలో ఉన్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 22న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.  నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 5వ తేదీతో ముగియగా.. పట్టభద్రుల స్థానానికి 35, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పది నామినేషన్లు దాఖలయ్యాయి.  పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 25 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది బరిలో మిగిలారు. యువ తెలంగాణ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ సైతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. పట్టభద్రుల అండతో విజయం సాధిస్తానని చెపుతున్న ఆమె తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను కలిసి మద్దతు కోరారు.