పట్టాలు తప్పిన దురంతో ఎక్స్‌ప్రెస్‌ 

ఒకే నెలలో నాలుగు రైలు ప్రమాదాలు

థానే: మ‌ళ్లీ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ఈ సారి మ‌హారాష్ట్రలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నాగ‌పూర్- ముంబై మ‌ధ్య తిరిగే దురంతో ఎక్స్‌ప్రెస్ డిరేయిల్ అయ్యింది. థానే జిల్లాలోని అస‌న్‌గావ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇవాళ ఉద‌యం 6.40 నిమిషాల‌కు రైలు ప‌ట్టాలు త‌ప్పిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఇంజిన్‌తో పాటు మొత్తం 7 బోగీలు ట్రాక్ నుంచి ప‌క్క‌కు త‌ప్పాయి. ప్ర‌మాదంలో సుమారు 20 గాయ‌ప‌డిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం. సెంట్ర‌ల్ రైల్వేఅధికారులు ప్ర‌మాద స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆప‌రేష‌న్స్ కొన‌సాగుతున్న‌ట్లు రైల్వే బోర్డు చైర్మ‌న్ అశ్వ‌ని లోహ‌నీ తెలిపారు. ప్ర‌యాణికుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు చేర్చిన‌ట్లు రైల్వే శాఖ తెలిపింది. ప‌క్క‌కు ఒరిగిన బోగీల నుంచి ప్ర‌యాణికులు దిగి వెళ్లిన‌ట్లు తెలుస్తున్న‌ది. ప్ర‌మాదం జ‌రిగిన రూట్లో ఎల‌క్ట్రిక్ సర‌ఫ‌రాను నిలిపేశారు. దురంతో రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డం వ‌ల్ల ముంబై, థానే మ‌ధ్య న‌డిచే లోక‌ల్ ట్రైన్ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో ఆ రూట్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయి. అయితే దురంతో ప‌ట్టాలు త‌ప్ప‌డానికి రైల్వే అధికారులు ఇంకా ఎటువంటి కార‌ణాల‌ను తెలియ‌జేయ‌లేదు. గ‌త మూడు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల కాసరా ఘాట్ రూట్లో ట్రాక్ దెబ్బ‌తిన్న‌ట్లు స‌మాచారం ఉంది. గ‌డిచిన రెండు వారాల్లో రైలు ప‌ట్టాలు త‌ప్పిన ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం ఇది మూడ‌వ సారి. ఆగ‌స్టు 23న కైఫియ‌త్ ఎక్స్‌ప్రెస్‌, ఆగ‌స్టు 20న ఉత్క‌ల్ ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పిన విష‌యం తెలిసిందే.