పట్టుదలకు పోవడం వల్లనే మహా సంక్షోభం

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

నాగపూర్‌,నవంబర్‌19(జనం సాక్షి): మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య తలెత్తిన విభేదాలు, ఎవరికి వారుగా విడిపోవడంపై రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పందించారు. కేవలం ఒకే అంశంపై పట్టుదలకు పోవడం వల్ల రెండువైపులా నష్టం జరుగుతుందని అన్నారు. స్వార్ధం అనేది చాలా చెడుచేస్తుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందేనని, అయితే కొందరు మాత్రమే స్వార్ధం వదలుకుని నిస్వార్థంగా ఉంటారని అన్నారు. నాగపూర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో భాగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి మెజారిటీకి అవసరమైన స్థానాలు సంపాదించుకున్నప్పటికీ అధికార పంపకాల విషయంలో రెండుగా చీలిపోయారు. ప్రస్తుతం ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన చర్చలు సాగిస్తోంది. 105 సీట్లతో బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలవగా, శివసేన 56, ఎన్‌సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్నాయి.