పఠాన్‌ కోట్‌ దాడిపై ఉమ్మడి దర్యాప్తు

4

– పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌

ఇస్లామాబాద్‌,జనవరి11(జనంసాక్షి):పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఉన్నత స్థాయి సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆదేశించారు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడితో పాకిస్థాన్‌కు లింకు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వైమానిక స్థావరంపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు పాక్‌ నుంచే చొరబడ్డారని భారత్‌ ఆధారాలు ఇవ్వడంతో ఆ దేశ ప్రధాని సంయుక్త దర్యాప్తు బృందం ఏర్పాటుకు అంగీకరించారు. సంయుక్త బృందంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ), మిలిటరీ ఇంటెలిజెన్స్‌(ఎంఐ)కు చెందిన ఉన్నత స్థాయి అధికారులు ఉంటారు. ఇవాళ నవాజ్‌ షరీఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ భేటీలో ఆ దేశ కేంద్ర ¬ంమంత్రి చౌదరీ నిసార్‌ అలీఖాన్‌, జాతీయ భద్రతా సలహాదారు నసీర్‌ ఖాన్‌ జాన్జువా, పీఎంవో అడ్వైజర్‌ సర్తాజ్‌ అజీజ్‌, ప్రధాని సలహాదారు తారిఖ్‌ ఫతేమి, ఆర్థిక మంత్రి ఇష్‌ దార్‌ పాల్గొన్నారు. పఠాన్‌కోట్‌ ఘటనపై ప్రధాని షరీఫ్‌ లోతుగా అధ్యయనం చేస్తున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రహేల్‌ షరీఫ్‌తోనూ ఈ అంశంపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాతనే సంయుక్త దర్యాప్తు టీమ్‌ను ఏర్పాటు చేసేందుకు షరీఫ్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ముందుకు సాగాలంటే షరీఫ్‌ తీసుకున్న నిర్ణయం కీలకంకానుంది.