పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్* 35 మంది విద్యార్థినులకు అనారోగ్యం* వైద్యం అందించిన యంత్రాంగం
జూలూరుపాడు, డిసెంబర్13, జనంసాక్షి: మండల పరిధిలోని పడమట నరసాపురంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు 35 మంది విద్యార్థినిలు అనారోగ్యం పాలయ్యారు. సోమవారం రాత్రి 25 మంది విద్యార్థులకు జూలూరుపాడులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యం అందించారు. వీరిలో ఎక్కువమంది కడుపునొప్పి వాంతులు విరోచనాలు వంటి లక్షణాలతో బాధపడటంతో వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది వైద్య సేవలు నిర్వహించారు. అనంతరం రాత్రి విద్యార్థినులను పాఠశాలకు పంపించారు. మంగళవారం ఉదయం మరో 10 మంది విద్యార్థులు కూడా ఇవే లక్షణాలతో బాధపడుతూ ఉండటంతో ఆసుపత్రికి తరలించి పాఠశాల యాజమాన్యం వైద్యం అందించింది. విషయం తెలుసుకున్న తాసిల్దార్ లూధర్ విల్సన్ ఉదయాన్నే ఆశ్రమ పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ విషయమై వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ కలుషిత నీరు లేదా ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. పడమటి నర్సాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కట్రం మోహన్ రావు, టిఆర్ఎస్ నేత ఖాజా రమేష్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులు అనారోగ్యానికి గురికావడం పట్ల వివరాలను తెలుసుకున్నారు. ఎంపీపీ లావిడియా సోనీ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ యదళ్ళపల్లి వీరభద్రం, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, మోదుగు రామకృష్ణ పలువురు నాయకులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు.