పతంజల్‌ చవన్‌ ప్రాశ్‌కు ఢిల్లీ కోర్టు షాక్‌

డాబర్‌ కేసులో ప్రకటనల నిలుపుదలకు ఆదేశాలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): బాబా రామ్‌దేవ్‌ పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆ సంస్థకు చెందిన ‘చవన్‌ ప్రాశ్‌’ బ్రాండ్‌ అడ్వర్‌టైజ్‌మెంట్ల ప్రసారం జరపరాదని ఆదేశించింది. తమ ఉత్పత్తిలను చులకన చేసే విధంగా పతంజలి ప్రచారం సాగుతున్నట్టు ప్రత్యర్థి బ్రాండ్‌ ‘డాబర్‌’ వేసిన పిటిషన్‌పై యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌లతో కూడిన బెంచ్‌ ఈ తాత్కాలిక ఆదేశాలిచ్చింది. ఈ అడ్వర్‌టైజ్‌మెంట్లను సెప్టెంబర్‌ 26వ తేదీ తదుపరి విచారణ వరకూ ఏ రూపంలో కూడా ప్రసారం చేయరాదని పతంజలి సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఈ విషయంలో ప్రాథమిక సాక్షాలతో సంతృప్తి చెందినందునే తాత్కాలిక రక్షణ అనేది అవసరమనే నిర్ణయానికి వచ్చాం’ అని బెంచ్‌ పేర్కొంది. డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ వాదనపై తమ వాదన ఏమిటో కూడా కోర్టుకు తెలియజేయాలని పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ను ఆదేశించింది. ఆయుర్వేద మెడిసన్స్‌, నేచురల్‌ కన్సూమర్‌ ఉత్పత్తుల్లో అతి పెద్ద సంస్థ అయిన డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ తమకు జరిగిన నష్టానికి గాను పతంజలి సంస్థ తమకు రూ.2.01 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కూడా పిటిషన్‌లో కోరింది. పతంజలి కమర్షియల్‌ యాడ్స్‌ ప్రచారాన్ని అడ్డుకోవాలంటూ డాబర్‌ ఇండియా వేసిన పిటిషన్‌ను ఈనెల 1న ఏకసభ్య బెంచ్‌ కొట్టివేసింది. దీంతో విస్తృత ధర్మాసనాన్ని డాబర్‌ ఆశ్రయించింది. పతంజలి ‘అక్రమ వాణిజ్య కార్యకలాపాలు’ కారణంగా తమ సంస్థకు పూడ్చుకోలేనంత నష్టం జరిగిందని, ట్రేడ్‌ డ్రెస్‌, ప్యాకేజింగ్‌ విషయంలో తమను అనుసరించడం వల్ల పెద్దగా చదువుకోని తమ కస్టమర్లు మోసపోతారని, ఇందవల్ల తమ బ్రాండ్‌కు తీరని నష్టం కలుగుతుందని డాబర్‌ వాదిస్తోంది. ఆగస్టు 24న పతంజలి ప్రొడక్ట్స్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌లోనూ, ఆగస్టు 25న యూట్యూబ్‌ చానెల్‌లోనూ పతంజలి అడ్వర్‌టైజ్‌మెంట్లు ప్రసారమైనట్టు కోర్టు దృష్టికి తెచ్చిన డాబర్‌…టీవీల్లోనూ త్వరలోనే ఈ ఉత్పత్తుల ప్రచారాన్ని చేపట్టే అవకాశాలున్నాయని భయాందోళనలను వ్యక్తం చేసింది.