పత్తిరైతులకు అండగా చర్యలు
గుర్తింపు కార్డులతో మోసాలకు చెక్
ఆదిలాబాద్,నవంబర్3(జనంసాక్షి): పత్తి కొనుగోళ్లులో అక్రమాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా పత్తి సాగుచేసే రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు సమగ్ర సర్వే నిర్వహించి అన్నదాతకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. సర్వే ఆధారంగా జిల్లాలోని పత్తి రైతులను గుర్తించి వారు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు సంస్థలకు అమ్మే విధంగా గుర్తింపు కార్డులు జారీచేశారు. మార్కెటింగ్ శాఖ అధికారులు జిల్లాకు వచ్చిన రైతు గుర్తింపు కార్డులను మండల వ్యవసాయ అధికారులకు అందచేశారు. మార్కెట్ యార్డులో వారి సంఖ్య ఎక్కువగా ఉండడం సీసీఐ పరిమితికి లోబడి కొనుగోలు చేయడంతో అసలైన రైతులకు పత్తిని విక్రయించే అవకాశం లభించేది కాదు. జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులకు మార్కెటింగ్ శాఖ అధికారులు గుర్తింపుకార్డులు పంపిణీ చేస్తుండడంతో అసలైన రైతులు మాత్రమే తమ పంటను సీసీఐకి విక్రయించే అవకాశం ఏర్పడింది. పత్తి రైతులకు అధికారులు గుర్తింపు కార్డులు పంపిణీ చేయడంతో మోసాలకు చెక్ పెట్టబోతున్నారు. కార్డులో రైతులకు సంబంధించిన పలు వివరాలను పొందుపరిచారు. ఐదేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే ఈ కార్డులో రైతుకు ప్రత్యేక నంబర్‌ను కేటాయించారు. సీసీఐకి పత్తిని విక్రయించాలంటే ఎనిమిది నుంచి 12 తేమశాతం, జిల్లా, మండలం, గ్రామం, ఆధార్ కార్డు నంబరు, రైతుకు
బ్యాంకు ఖాతా నంబరు, బ్యాంకు పేరు, సెల్‌ఫోన్ నంబరు, రైతుకు ఉన్న భూమి ఎంత, ఎన్ని ఎకరాల్లో పత్తిని సాగు చేశారు లాంటి వివరాలను పొందుపర్చారు. దీంతో పాటు పంట పెట్టుబడుల కోసం రైతులు వ్యాపారుల వద్ద అప్పులు తీసుకున్నప్పుడు వారికే పంటను తిరిగి విక్రయించాలనే నిబంధన విధిస్తారు. రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో కొంత ధరకు అప్పు తీసుకున్న వారికి పంటను అమ్ముకోవాల్సి వస్తున్నది. దీంతో రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సాగుచేసిన పంటకు సరైన ధర రాక నష్టపోవాల్సి వస్తున్నది. ఇలాంటి వారు సైతం గుర్తింపు కార్డులను ఉపయోగించుకునే సీసీఐ కేంద్రాల ద్వారా మంచి ధరను పొందవచ్చు. జిల్లాకు సరిహద్దులో మహారాష్ట్ర ఉండడం అక్కడి నుంచి పత్తి, ఇతర పంటలు ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు విక్రయానికి తీసుకువచ్చే వారు. దీంతో రైతులకు నష్టపరిహారం అందచేయడంలో సమస్యలు తలెత్తేవి. ప్రస్తుతం గుర్తింపుకార్డులు ఉన్న రైతులు మాత్రమే సీసీఐకి పత్తిని విక్రయించుకునే అవకాశాలు ఉండడంతో ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించినట్లయింది.