పత్తిరైతులకు పరిహారం చెల్లించాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మహారాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన తరహాలో పత్తిపండించిన రైతులకు హెక్టారుకు రూ.50వేల పరిహారాన్ని  చెల్లించి సంబంధిత కంపెనీ నుంచి రికవరి చేసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు కలవేన శంకర్‌ డిమాండ్‌ చేశారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుతం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదన్నారు. అలాంటి కంపెనీ పై ప్రభుత్వం కేసు పెట్టకపోవడంలో మతలబేంటని ప్రశ్నించారు. రైతులను మోసం చేసిన కంపెనీ పై పీడీ యాక్డు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకర్లు రుణాల రికవరిలో రైతులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు. గులాబీ పురుగు ఉద్దృతి, నకిలి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని  డిమాండ్‌ చేశారు.  గత 20 సంవత్సరాల నుంచి ఇంత కరవు పరిస్థితి తలెత్తలేదని, ఎకరానికి ఒకటి, రెండు క్వింటాళ్ల దిగుబడి రాకపోవడంతో రైతులు అప్పుల్లో కురుకుపోయారన్నారు. అప్పులబాధ భరించలేక రైతులు తనువు చాలిస్తున్నారని అన్నారు. మరో వైపు   చలీతీవ్రత అధికంగా ఉన్నందున పంటలకు కాత, పూత రాని పరిస్థితి ఉన్నందున వాతావరణ ఆధారిత బీమా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితి పై వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించాలని డిమాండ్‌ చేశారు.