పథకాల ఉద్దేశాన్ని ప్రజలకు వివరించాలి

వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్‌,మే29(జ‌నం సాక్షి ): ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం అందిస్తున్న చీరలను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. అమ్మఒడి, కేసీఆర్‌ కిట్ల గురించి టీచర్లకు మంత్రి ప్రశ్నలు వేశారు. వారు తడబడుతూ చెప్పడంతో విూకే పూర్తి అవగాహన లేకపోతే మహిళలకు ఎలా వివరిస్తారని ప్రశ్నించారు. అమ్మాయి పుడితే 13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలతోపాటు ఆసుపత్రిలో కేసీఆర్‌ కిట్టు అందజేస్తారని వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్నారు. శస్త్రచికిత్సలు తగ్గుముఖం పట్టాయన్నారు. బాలింతలు, గర్బిణులు చికిత్స కోసం ఆసుపత్రికి రావాలి అనుకుంటే 102కు ఫోన్‌ చేస్తే ఇంటికి అంబులెన్స్‌ వస్తుందని వివరించారు. పట్టణానికి 100 పడకల ప్రసూతి ఆసుపత్రి మంజూరైందన్నారు. రూ. 17 కోట్లతో పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షురాలు నవనీత, ఆర్డీవో రాజేశ్వర్‌, సీడీపీవో అనురాధ, ఎంపీపీ రేష్మాబేగం, జడ్పీటీసీ జంగం విజయ, సర్పంచి వాణి తదితరులు పాల్గొన్నారు.